పన్ను కట్టలేదని గుడికి తాళం

  • అనంతపురం అమ్మవారి శాలపై ప్రతాపం
  • ఒకరోజుకుపైగా ఆలయానికి తాళాలు
  • ఆందోళనతో వెనక్కి తగ్గిన అధికారులు

అనంతపురం kondalamma: ఆస్తి పన్ను చెల్లించని వారు కోకొల్లలు! అందులో… ఎందరెందరో బడాబాబులు! కానీ… అధికారులు మాత్రం ఒక ఆలయంపై ప్రతాపం చూపించారు. పన్ను కట్టలేదంటూ గుడికి తాళం వేసేశారు. భారీ ఎత్తున ఆందోళన చేయడంతో… దిగి వచ్చారు. అనంతపురం పట్టణంలోని కొత్తవూరు అమ్మవారి శాల (వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం)విషయంలో మునిసిపల్‌ అధికారులు ఇలా వ్యవహరించారు. అమ్మవారిశాల కల్యాణ మండపానికి సంబంధించి పన్ను బకాయి చెల్లించాలంటూ గతవారం మునిసిపల్‌ అధికారులు ఒత్తిడి తెచ్చారు. కోశాధికారి అందుబాటులో లేరని, కొద్దిగా సమయం ఇవ్వాలని నిర్వాహకులు కోరినా పట్టించుకోలేదు. అప్పటికప్పుడు ప్రధాన ద్వారానికి తాళం వేసి వెళ్లిపోయారు. కల్యాణ మండపంతోపాటు ఆలయానికి వెళ్లేందుకు అదే దారిలో వెళ్లాల్సి ఉంది. దశాబ్దాల చరిత్ర ఉన్న ఆలయం అధికారుల నిర్వాకంతో మూతపడాల్సి వచ్చింది. దీంతో ఆర్యవైశ్య సంఘం నాయకులు, అనంత నగరాభివృద్ధి వేదిక ప్రతినిధులు, ఇతరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సప్తగిరి సర్కిల్‌ వద్ద మానవహారం నిర్వహించారు. ర్యాలీగా నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనర్‌ చల్లా ఓబులేసు చాంబర్‌ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా తరలించే క్రమంలో అనంత నగరాభివృద్ధి వేదిక నేత కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, మరికొందరికి గాయాలయ్యాయి. నిబంధనల ప్రకారమే తమ సిబ్బంది తాళాలు వేసి ఉండొచ్చని కమిషనర్‌ చెప్పారు. మనోభావాలు దెబ్బతిని ఉంటే నగర పాలక సంస్థ తరపున తాను క్షమాపణ చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు. రెండు రోజులపాటు మూతపడిన ఆలయ తలుపులు తెరిపించారు.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

50 − = 44