Sankranti Festival Celebrations started at Vizag

సంక్రాంతి వస్తోంది.. అంతటా సందడి తెస్తోంది.. మహా నగరం నుంచి తమతమ సొంతూర్లకు వెళ్లేవారు.. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న విశాఖవాసులు ఇక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆర్టీసీ, రైల్వేల పరంగా ఇప్పటికే రిజర్వేషన్లన్నీ పూర్తయిపోయాయి. ఆర్టీసీ అదనపు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. రైల్వే కూడా అవసరాన్ని బట్టి ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధమవుతోంది.

విద్యాసంస్థలకు ఈ నెల 11 నుంచి సెలవులు. ముందురోజు ఆదివారం నుంచే ప్రయాణికుల రద్దీ భారీగా ఉండొచ్చని అంచనా. విశాఖ నుంచి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ 220కిపైగా అదనపు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్‌ – విశాఖ మధ్య మరో 150 ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తున్నారు.

సంక్రాంతి సెలవుల కోసం నగరంలోని దాదాపు 65 నుంచి 75 శాతం జనం స్వగ్రామాలకు వెళతారు. ఉపాధి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రామీణ, తూర్పు గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఎక్కువ. సంకాంత్రికి రెండు నుంచి మూడు రోజుల ముందుగానే వీరంతా సొంత గ్రామాలకు వెళతారు. సాధారణ రోజుల్లో 800 బస్సుల ద్వారా రోజుకు సగటున 1.20 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా.. పండగ రోజుల్లో 1.50 లక్షలమంది ప్రయాణిస్తారని అంచనా. దీంతో పండగ మూడు రోజులూ మహా నగర వీధులు కర్ఫ్యూనుతలపిస్తాయంటే అతిశయోక్తి కాదు.

* నగరం నుంచి శ్రీకాకుళం, సోంపేట, మందస, ఇచ్చాపురం, రాజాం, పాలకొండ, పర్లాకిమిడి తదితర ప్రాంతాలకు సాధారణ రోజుల్లో 250 బస్సులు నడుస్తుంటాయి. పండగ దృష్ట్యా అవసరాన్ని బట్టి 100 నుంచి 150 బస్సులు అదనంగా నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనివార్యమనుకుంటే విశాఖ నగర పరిధిలోని డిపోల బస్సుల సేవలు కూడా వినియోగిస్తారు.

* నగరం నుంచి విజయనగరం, గజపతినగరం, రామభద్రపురం, సాలూరు,బొబ్బిలి, పార్వతీపురం తదితర ప్రాంతాలకు సాధారణ రోజుల్లో 150 నుంచి 180 బస్సులు నడుపుతుంటారు. సంక్రాంతి పండగ కోసం అదనంగామరో 70 బస్సులు నడిపేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే మరికొన్ని బస్సులు కూడా నడిపే యోచనతో సంబంధిత వర్గాలున్నాయి.

* నగరం నుంచి అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, పాయకరావుపేట, పాడేరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి, తూర్పు గోదావరిజిల్లాలోని అమలాపురం, రాజోలు తదితర ప్రాంతాలకు సాధారణ రోజుల్లో1,050 బస్సులు నడుపుతున్నారు. అవసరాన్ని బట్టి రద్దీలేని చోట తగ్గించి మిగతా ప్రాంతాలకు మళ్లించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అనివార్యమైతే నగరంలో తిరిగే సిటీ బస్సులను కూడా ఈ ప్రాంతాలకు పంపాలని అధికారులు నిర్ణయించారు.

ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా…
విశాఖపట్నం నుంచి సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాంబశివరావు ఆదేశాలపై కార్యనిర్వాహక సంచాలకులు (ఈడీ) రామకృష్ణ నాలుగు జిల్లాల ప్రాంతీయ మేనేజర్లతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశమై జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ నెల 8 నుంచి 18 మధ్య బస్సులు అందుబాటులో ఉండేలా ఈడీ ఆదేశాలిచ్చారు. అవసరమైతే నగరంలోని సిటీ బస్సులను కూడా ఇతర ప్రాంతాలకు మళ్లించేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఉప ప్రధాన ట్రాఫిక్‌ మేనేజర్‌ (డీసీటీఎం)సీహెచ్‌ అప్పలనారాయణ బుధవారం ‘ఈనాడు’కి తెలిపారు. ప్రత్యేక బస్సుల కోసం ఆర్టీసీ కాంప్లెక్సు ఆవరణలోని ప్రత్యేక కౌంటర్లలోనూ టిక్కెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆన్‌లైన్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఈ నెల 8 నుంచి 14 మధ్య నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రోజూ రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య 1.50 లక్షలు ఉంటుందని అధికార వర్గాల అంచనా.

rush

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 86 = 96