పురాణాలులో స్త్రీల యొక్క ప్రాముఖ్యత

* భార్య ఉంటేనే చెల్లుబాటు!

మానవ లోకంలోనే కాదూ దేవలోకాల్లోనూ పురుషులు చెల్లుబాటు కావాలంటే వారి పక్కన భార్యలు ఉండాల్సిందే అనే ఈ విషయం కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా ఇది మాత్రం వాస్తవం అని అంటోంది బ్రహ్మవైవర్త మహాపురాణం ప్రకృతిఖండం ఒకటో అధ్యాయంలోని ఈ కథాంశం. కొంతమంది దేవతలు కొన్నికొన్ని కార్యాలను సఫలం చేయాలంటే వారి భార్యల మీద ఆధారపడి తీరాల్సిందే. ఎందుకంటే ఆ దేవతల భార్యలంతా ప్రకృతికి సంబంధించిన అంశాస్వరూపలు. ఈ క్రమంలో చూస్తే మొదటిగా భార్య మీద ఆధారపడింది సాక్షాత్తూ అగ్నిదేవుడే. ఆయన భార్య పేరు స్వాహాదేవి. యజ్ఞంలో ఆమె లేకుండా హవిస్సులిస్తే దేవతలు ఆ హవిస్సులు తీసుకోలేరు. దక్షిణాదేవి యజ్ఞుడి పత్ని. ఆమె పక్కన లేకపోతే సమస్త కర్మలూ నిష్ఫలం అవుతాయి.

స్వధాదేవి పితృ పత్ని. స్వధాకారం లేకుండా పితృకర్మలలో చేసే దానం లాంటివన్నీ వ్యర్థమవుతాయి. వాయువు భార్య స్వస్తిదేవి. ఆమె లేకుండా చేసిన ఆ దాన ప్రదానాలు వ్యర్ధమవుతాయి. షష్టిదేవి గణపతి భార్య. అనంతుడి భార్య పేరు పుష్టిదేవి. సంపత్తి ఈశ్వరుడి భార్య. ధృతి కపిలమహర్షి భార్య. క్షమ యముడి భార్య. క్షమ లేకపోతే సమస్తలోకాలు కోపంతో పిచ్చెక్కినట్లు ఉంటాయి. రతిక్రీడకు అధిష్టానదేవత రతీదేవి. రతికేళి కౌతుకానికి కారణమైన ఈమె మన్మథుడి భార్య. సత్యానికి భార్య ముక్తి. అలాగే మోహానికి దయ పత్ని. ప్రతిష్ఠాదేవి పుణ్యానికి పత్ని. పేరు ప్రతిష్టలకు కారణభూతురాలైన కీర్తిదేవి సుకర్మ భార్య. క్రియాదేవి ఉద్యోగ పత్ని.

* కలియుగంలోనే ఆమెకు రూపం

మిథ్యాదేవి అధర్ముడి భార్య. ఈమె విశేషమేమంటే కృతయుగంలో ఈమె కనిపించదు. త్రేతాయుగంలో సూక్ష్మరూపంలోనూ, ద్వాపరయుగంలో ముడుచుకొనిపోయి అర్థాయవాలతోనూ, కలియుగంలో మాత్రం స్పష్టంగా, సర్వాంగాలతోనూ కనిపిస్తూ ఉంటుంది. ఈమెకు కపటుడు అనే సోదరుడు కూడా ఉన్నాడు. అతడితో కలిసి ఇంటింటికీ ఈమె ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. శాంతి, లజ్జ అనేవారు సుశీలుడి భార్యలు. బుద్ధి, మేధ, స్మృతి అనే ముగ్గురూ జ్ఞానదేవుడికి భార్యలు. ఎంతో అందంగా శాంతరూపంతో కనిపించే మూర్తీదేవి ధర్ముడి పత్ని. ఈమె లేకపోతే సమస్తలోకాలు, పరమాత్మ కూడా నిరాధారుడైపోతారు. ఎంతో కాంతిగా ఉండే ఆమె లక్ష్మీదేవి స్వరూపిణి. ఈమె శ్రీ అనే రూపంలో కూడా ఉంటూ అందరి గౌరవాలను అందుకొంటూ ఉంటుంది.

నిద్రాదేవి కాలాగ్ని రుద్రుడి భార్య. ఈ తల్లి మాయలో సమస్తలోకాలు రాత్రివేళల్లో మునిగిపోతూ ఉంటాయి. సంధ్య, రాత్రి, దినం అనే ముగ్గురూ కాలం భార్యలు. క్షుత్‌, పిపాసలు (ఆకలిదప్పులు) లోభదేవత భార్యలు. ప్రభ, దాహికా అనే ఇద్దరూ తేజస్సుకు భార్యలు. కాలుని కుమార్తెలైన మృత్యు, జర అనే ఇద్దరూ ప్రజ్వలుడి భార్యలు. నిద్రాదేవి కూతురైన తంద్ర సుఖదేవుడి భార్య. సుఖదేవుడికే ప్రీతి అనే మరో భార్య కూడా ఉంది. శ్రద్ధ, భక్తి అనే ఇద్దరూ వైరాగ్యుడి భార్యలు. అలాగే దేవతలందరికీ తల్లి అయిన అదితి, గోవులకు మాత అయిన సురభి, దైత్యులకు తల్లి అయిన దితి, నాగులమాత కద్రువ, గరుత్మంతుడి తల్లి వినత, వీరి సపత్ని దనువు అనే వారంతా సృష్టిక్రమంలో ఎంతో ప్రధాన బాధ్యతను నిర్వర్తించారు. వీరంతా ప్రకృతికి సంబంధించిన సూక్ష్మాంశ స్వరూపాలు. వీరు పక్కన లేకపోతే వీరి భర్తలకు పెద్ద గుర్తింపు ఉండేదికాదు.

* స్త్రీలంతా లక్ష్మీదేవి సూక్ష్మాంశలే…

అలాగే రోహిణీదేవి చంద్రుడి భార్య. సంజ్ఞాదేవి సూర్యుడి భార్య. శతరూప మనువు పత్ని. ఇంద్రుడి భార్యపేరు శచీదేవి. తార బృహస్పతి భార్య. అరుంధతి వసిష్ఠుడి భార్య, అహల్యాదేవి గౌతమ మహర్షి ఆలి. ఇలా ఈ దంపతుల వరుసలో ఉన్న భార్యలు ఎంతో ప్రధాన పాత్ర వహిస్తుంటారు. పార్వతీదేవిని కన్న మేనక, లోపాముద్ర, హోలీ, వరుణాని, యమపత్ని, వింధ్యావళి, కుంతి, దమయంతి, యశోద, దేవకీదేవి, గాంధారి, ద్రౌపది, సత్యవంతుడి భార్య సావిత్రి, రాధకు తల్లి అయిన కళావతి, మండోదరి, కౌసల్య, సుభద్ర, కైకేయి, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, మిత్రవింద, నాగ్నచ్కీజిజితి వీరంతా వారివారి భర్తల సరసన ఉండి సకల కార్యాలను ఫలవంతం చేస్తుంటారు. సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపిణులైన సీత, రుక్మిణి, అలాగే వ్యాసుడి తల్లి అయిన యోజనగంధి, బాణాసురుడి కూతురు ఉషాదేవి, ఆమె స్నేహితురాలు చిత్రలేఖ, ప్రభావతి, భానుమతి, మాయావతి, పరశురాముడి తల్లి రేణుకాదేవి, బలరాముడి తల్లి రోహిణిదేవి, శ్రీకృష్ణుడికి సోదరి అయిన దుర్గ ఇలాంటి వారంతా ప్రకృతికి సంబంధించిన అంశాస్వరూపలు. వీరితోపాటుగా ఎందరెందరో గ్రామదేవతలు ఇలాంటి వారంతా ప్రకృతి సుక్ష్మాంశతో ఆవిర్భవించినవారే. అందుకనే యజ్ఞయాగాది శుభకార్యాలు జరిపేటప్పుడు వీరంతా వారి భర్తల పక్కన ఉన్నప్పుడే శుభకార్యలన్నీ విజయవంతం అవుతుంటాయి. అంటే ఆయా దేవతల భార్యలను గౌరవించకుండా చేసిన పనులేవీ ఫలవంతం కావు. భూలోకంలో స్త్రీలు కూడా లక్ష్మీదేవి సూక్ష్మాంశతో జన్మించిన వారేనంటారు. అందుకే దంపతి తాంబూలాలు, దంపతి పూజలువంటి వాటిలో ఈనాటికీ తప్పనిసరిగా ముందుగా స్త్రీలకు గౌరవం లభిస్తుంది.

Durga-Maata

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + 8 =