NTR Medical Checkup Scheme Started By CM Chandra Babu

పేదల ఆరోగ్యాన్ని కాపాడటానికి అన్ని రకాలుగా ఆలోచించి కేవలం 75 రోజుల వ్యవధిలో ఎన్టీఆర్‌ వైద్య పరీక్ష పేరుతో వివిధ సేవలను అందించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో 500 మంది వైద్యులు, వెయ్యి మంది నర్సులను నియమించడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్‌ వైద్య పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా నిర్మించిన ప్రసూతి శిశు ఆరోగ్యకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అదే ప్రాంగణంలో టెలీరేడియాలజీని ప్రారంభించి అక్కడ వైద్యం పొందుతున్న ఒకవ్యక్తి పరీక్షా నివేదికలను హైదరాబాద్‌ వైద్యులకు పంపించారు. అనంతరం ముఖ్యమంత్రి 102 కాల్‌సెంటర్‌ను, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను, యంత్ర పరికరాలు నిర్వహణ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రారంభించిన సేవలన్నీ ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతాయన్నారు. తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు తెలుగువారంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్‌ వైద్యపరీక్షలో జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో 60, సామాజిక ఆసుపత్రు(సీహెచ్‌సీ)ల్లో 40, ప్రాథమిక ఆరోగ్యకేంద్రా(పీహెచ్‌సీ)ల్లో 19 వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తామని ప్రకటించారు. ఈ వైద్య పరీక్షలు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న పరికరాలతో చేస్తారని ఒకవేళ అక్కడ ఆ సదుపాయాలు లేకపోతే మిగిలిన పరీక్షలను చేయించే విధంగా అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించామన్నారు. ప్రతీ సేవ కూడా నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని, ప్రస్తుతం ఈ ఎన్టీఆర్‌ ఆరోగ్య పరీక్షలను జిల్లా ఆసుపత్రుల్లో ప్రారంభించామని, ఫిబ్రవరి ఒకటి నుంచి ఏరియా, పీహెచ్‌సీల్లో ఆరంభమవుతాయన్నారు. అలాగే టెలీ రేడియాలజీ ద్వారా రోగి పరీక్షల నివేదికలు ఇతర ప్రాంతాల్లో వైద్యులకు పంపించి వారి సూచనల ద్వారా వైద్యం చేయించుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని వైద్యపరికరాలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ అందుబాటులోకి వచ్చేలా పనులను గుత్తేదారుకు అప్పగిస్తామన్నారు. ప్రసవం అయ్యాక తల్లీపిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకోవడానికి వీలుగా తల్లీ, బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించామని, 102 సహాయకేంద్రానికి(కాల్‌సెంటర్‌) ఫోన్‌చేయడం ద్వారా ఆ సేవను పొందవచ్చన్నారు. ఆసుపత్రి పారిశుద్ధ్య నిర్వహణను పొరుగుసేవల సంస్థకు అప్పగిస్తామన్నారు. ఆసుపత్రుల్లో జీవ, వైద్య వ్యర్థాలను (బయో మెడికల్‌ వేస్ట్‌) కూడా ఒక ఏజెన్సీకి అప్పగించి ఇక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని, ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పరిపాలనాధికారులను నియమిస్తామని, వీరు పైన పేర్కొన్న నిర్వహణ విధానాన్ని పరిశీలిస్తారన్నారు. ఆసుపత్రి ఆవరణలో చెట్లు, పూలమొక్కలు పెంచడం ద్వారా రోగి ఆహ్లాదంగా గడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమయితే ఆసుపత్రిలో ఖాళీ ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించి మానసిక ప్రశాంతతకు కృషి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్లు ఖర్చు పెడుతున్నామని, పేదల కోసమే తాను సీఎంగా ఉన్నాను తప్ప నాయకులు, అధికారులు కోసం కాదని అన్నారు. ఆసుపత్రిలో వైద్యుల రాకపోకలను బయోమెట్రిక్‌ హాజరు విధానం ద్వారా పరిశీలిస్తామని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ కచ్చితంగా ఆసుపత్రిలో సేవలందించాల్సిందేనన్నారు. ఆరునెలలు రాకపోతే సంబంధిత వైద్యుడ్ని తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇష్టం లేకుండా కొనసాగే వారు రాజీనామాలు చేసి వెళ్లిపోతే వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామన్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవలో ప్రైవేటు వైద్యులు కూడా ప్రభుత్వాసుపత్రికి వచ్చి సేవలందించేలా చేస్తామని, దీనికి ప్రభుత్వం రుసుము చెల్లిస్తుందన్నారు. ఎన్ని శస్త్రచికిత్సలు జరిగితే అంత సొమ్ము సంబంధిత ప్రభుత్వాసుపత్రికి అందుతుందన్నారు.అవసరమైతే ఇక్కడే ఉండి నీరందిస్తా.. ఉభయగోదావరి జిల్లాల్లో రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడవద్దని అవసరమైన విస్తీర్ణానికి సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. కలెక్టర్‌కు ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. విభజన సమయంలో ప్రధానమంత్రి మోదీ ద్వారా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయకపోతే సీలేరు రాష్ట్రానికి వచ్చేది కాదని, సీలేరు లేకపోతే గోదావరి జిల్లాల్లో మొదటి పంటకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉండేదన్నారు. ప్రస్తుతం 40 టీఎంసీలు నీరు అందుబాటులో ఉందని, మిగిలిన 20 టీఎంసీలు కూడా ఒడిశాను ఒప్పించి వారికి అవసరమైన విద్యుత్తును ఇచ్చి నీరు తెస్తామన్నారు. ఇప్పటికే పంటలు సాగవుతున్న మెట్టప్రాంతాలకు కూడా ఇబ్బంది రాన్విమని, గోదావరి జిల్లాలకు సాగునీటి సమస్య పరిష్కారం అయ్యే వరకూ నిర్ణీత ఆయకట్టులో నీరు అందజేయడానికి అవసరమైతే పుష్కరాల మాదిరిగా తాను ఉభయగోదావరి జిల్లాల్లోనే ఉంటానని ప్రకటించారు.

ముఖ్యమంత్రితోపాటు మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, విప్‌లు చింతమనేని ప్రభాకర్‌, అంగర రామ్మోహన్‌, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, జడ్పీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, ఏలూరు మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌ పూనం మాలకొండయ్య ఉన్నారు.

#NTRVaidyaParikshalu #NTRVaidyaSeva #ThalliBiddaVehicleNo. #102ThallibiddaNo

ntcm copy

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − = 14