Visakha airport Improves its Convectivity International

స్మార్ట్‌ సిటీ విశాఖకు ఎయిర్‌ కనెక్టివిటీ ప్లస్‌ అవుతోంది. ప్రయాణికులతో నిత్యం సందడిగా కనిపించే విశాఖ విమానాశ్రయం రాష్ట్రంలోనే అత్యధిక ప్రయాణికులను తీసుకువెళుతూ నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. ఈ ఎయిర్‌పోర్టుకు మరిన్ని అంతర్జాతీయ విమానాలు తీసుకువస్తామంటున్న ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ వినోద్‌శర్మను ఆంధ్రజ్యోతి పలకరించింది. ఆ విశేషాలు.. ఒకప్పుడు ధనిక వర్గాలకే పరిమితమైన విమానయానం ఇప్పుడు మరెందరికో చేరువైంది. విమానయాన సంస్థల మధ్య పోటీ.. ప్రయాణికుల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తోంది. టికెట్‌ ధరలు అందుబాటులోకి రావడంతో మధ్యతరగతి జనాలు కూడా విమానాల్లో ప్రయాణించగలుగుతున్నారు. ప్రత్యేక ఆఫర్లలో టికెట్‌ బుక్‌ చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఏటా 13 లక్షల మంది..
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ విమానాశ్రయం నంబర్‌ వన్‌గా నిలిచింది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి ఏడాదికి సుమారు 13 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల కన్నా విశాఖ ఎయిర్‌పోర్టు అన్ని విధాలా ముందంజలో ఉంది. విశాఖ నుంచి విస్తృతమైన ఎయిర్‌ కనెక్టివిటీ ఉండటంతో పాటు ఐటీ రంగం అభివృద్ధి చెందడం, తరచూ జాతీయ, అంతర్జాతీయస్థాయి సదస్సులు, క్రీడా పోటీలు, ప్రభుత్వ కార్యక్రమాలకు విశాఖ వేదిక అవుతుండటంతో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒక్క అక్టోబర్‌ నెలలోనే లక్షన్నర మంది రాకపోకలు సాగించారు.
అంతర్జాతీయ విమానాలు..
వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నిత్యం 54 సర్వీసుల ద్వారా సుమారు ఆరు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఉంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ కనెక్టివిటీ ఉండటంతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఎయిర్‌ ఇండియా, సిల్క్‌ ఎయిర్‌, మలిండో, ఎయిర్‌ ఆసియా సంస్థలు విశాఖ నుంచి దుబాయ్‌, సింగపూర్‌, కౌలాలంపూర్‌లకు విమాన సర్వీసులను నడుపుతున్నాయి. వారానికి మూడు రోజులు అంతర్జాతీయ విమానాలు 70 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. త్వరలో అరేబియా ఎయిర్‌లైన్స్‌ సంస్థ దుబాయ్‌కు నేరుగా విమానం నడిపేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. కొలంబోకు సర్వీసులు నడిపే విషయమై శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రతినిధులు ఇప్పటికే విశాఖలో పర్యటించారు. ఇక్కడి సౌకర్యాలపై ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఈ సర్వీసులు తొందర్లోనే ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. బ్యాంకాక్‌కు విమాన సర్వీసు ప్రారంభించాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవోతో దృష్టికి తీసుకెళ్లాం. ఆ సర్వీసు ప్రారంభమైతే విశాఖకు మరింత అంతర్జాతీయంగా ఖ్యాతి లభిస్తుంది.
మరో మూడు, నాలుగేళ్ల వరకు..
ప్రస్తుతం విమానాశ్రయంలో ఉన్న సదుపాయాలను బేరీజు వేసుకుంటే మరో మూడు, నాలుగేళ్ల వరకు ఢోకా లేదు. ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరిగినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరో ఐదేళ్లలో అవసరమైతే టెర్మినల్‌ భవనాన్ని కూడా విస్తరించే వీలుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చెకిన్‌ ఏరియా పెంచాం. సందర్శకులను టికెట్‌పై కొద్దిరోజుల నుంచి అనుమతిస్తున్నాం. కొత్తగా ఆరు పార్కింగ్‌ స్థలాలను అభివృద్ధి చేశాం. సెక్యూరిటీ హాల్ట్‌ను ఇటీవలే విస్తరించాం. సుమారు 300 మంది ప్రయాణికులు కూర్చునేలా దీనిని తీర్చిదిద్దాం. వైఫై అందుబాటులోకి తెచ్చాం. అంతర్జాతీయ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని టాయిలెట్లు ఆధునీకరిస్తున్నాం.
శరవేగంగా సుందరీకరణ..
ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా, విశాఖ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (వుడా) సంయుక్తంగా సుందరీకరణ పనులు చేపడుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాలను తీర్చిదిద్దిన సంస్థకు ఆ పనులు అప్పగించాం. అంతా మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేస్తున్నాం. ఫౌంటేన్లు, పూల మొక్కలు, లాన్‌, ఆకర్షణీయ ఆకృతులు ఇలా ఎన్నో ఆకర్షణలు కల్పిస్తున్నాం. చూడగానే పర్యాటకులను ఇట్టే ఆకట్టుకునేలా ఎయిర్‌పోర్టును తీర్చిదిద్దుతున్నాం.
చాలెంజింగ్‌ జాబ్‌..
గతంలో కొన్ని ఏరియాల్లోనే పనిచేశాను. ఈ ఏడాది ఆరంభంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఇక్కడ ఇంజనీరింగ్‌, సెక్యూరిటీ, కమర్షియల్‌, ఫెసిలిటీస్‌, ఆపరేషన్స్‌.. ఇలా అన్నింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవాలి. రోజుకో కొత్త విషయం నేర్చుకునే అవకాశం కలుగుతోంది. నేను పుట్టింది పెరిగింది హిమాచల్‌ప్రదేశ్‌లో. బీఎస్సీ, ఎంబీఏ చదివాను. 1989లో ఢిల్లీ (ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌) ఏటీసీలో చేరాను. సెక్యూరిటీ డైరెక్టరేట్‌లో ఎనిమిదేళ్లు పనిచేశాను. తొలిసారి ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాను. రాబోయే ఏడాది కాలంలో ప్రయాణికుల సంఖ్య ఇరవై లక్షలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. అందులో భాగంగా ఎయిర్‌ కనెక్టివిటీని మరింత పెంచేందుకు నా వంతు కృషి చేస్తున్నాను.భారీగా నష్టం
హుద్‌హుద్‌ తుపాను సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎయిర్‌పోర్టుకు సుమారు రూ.60 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. ప్రయాణికుల తాకిడి అధికంగా ఉన్న కాలంలో తుపాను విరుచుకుపడింది. మొత్తం వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి ఐదు రోజుల్లోనే విమాన సర్వీసులు పునరుద్ధరించగలిగాం. మూడు నెలల క్రితం బలంగా వీచిన ఈదురుగాలులకు పైకప్పు వంగిపోయినప్పుడు నాణ్యతపై విమర్శలు వచ్చాయి. ఐఐటీకి చెందిన ప్రొఫెసర్‌తో అధ్యయనం చేయిస్తే నూరు శాతం సురక్షితమని నిర్ధారించారు. అందువల్ల ఈ విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు.

వైజాగ్‌లో డొమెస్టిక్‌ కార్గో రోజురోజుకు పెరుగుతోంది. ప్రారంభంలో ఒక టన్ను వస్తే.. ఇప్పుడు అది మూడు టన్నులకు చేరింది. అలాగే ఇక్కడి నుంచి బయట ప్రాంతాలకు గతంలో మూడు నుంచి నాలుగు టన్నులు రవాణా అయ్యేది. ప్రస్తుతం అది 8-10 టన్నులకు పెరిగింది.

indigo

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + 4 =