మరిచిన మానవత్వం

 

బెంగళూరు : ‘‘వీపు, భుజం, కాలుపై కత్తిపోట్లు.. ధారాళంగా కారిపోతున్న రక్తం.. సహాయం కోసం ఆర్తనాదాలు.. అయినా ఎవ్వరూ పటించుకోలేదు.. ఎవరైనా కాపాడుతారన్న ఆశ అంతో ఇంతో ఉన్నా.. ఎదురుచూసే టైం లేదు.. అందుకే ఓవైపు రక్తం కారిపోతున్నా పట్టించుకోకుండా ప్రాణాలు దక్కించుకునేందుకు నడక మొదలు పెట్టాడు ఆ యువకుడు.. అలా ఏదో కొంత దూరం కాదు.. ఏకంగా రెండున్నర కిలోమీటర్లు నడిచాడు.. చివరకు ఓ వ్యక్తి దయతో ఆటో ఎక్కి ఆస్పత్రికి చేరాడు.. క్రమంగా కోలుకుంటున్నాడు..’’ ఇది ఎక్కడో నిర్జన ప్రదేశంలో జరిగింది కాదు.
మహానగరం బెంగళూరులో గత శనివారం సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు ఐటీ ఉద్యోగి. ఉల్సూరుకు చెందిన సంతోష్‌ గత శనివారం కేఆర్‌ పురంలో ఓ మిత్రుడిని కలిసేందుకు వెళ్ళి.. రాత్రి 9.30 గంటల సమయంలో సిటీ బస్సు కోసం ఐటీఐ ఫ్లైఓవర్‌ మీదుగా ఓల్డ్‌ మద్రాస్‌ రోడ్‌ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. ‘‘ సరిగ్గా రాత్రి 9.45 గంటల సమయంలో ఫ్లై్ౖలఓవర్‌ మధ్యలో ఉండగా.. ఎదురుగా ఇద్దరు బైక్‌పై వచ్చారు. కేఆర్‌ పురం రైల్వే స్టేషన్‌కు ఎలా వెళ్ళాలని అడిగారు. నేను సమాధానం చెబుతుండగానే.. హఠాత్తుగా నన్ను తిట్టడం మొదలు పెట్టారు. ఇంతలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి నాపై హెల్మెట్‌ విసిరి నా ఫోన్‌ లాక్కునే ప్రయత్నం చేశాడు.
నేను ప్రతిఘటించడంతో బెక్‌ వెనక కూర్చున్న వ్యక్తి కిందకు దిగి తన దగ్గరున్న కత్తితో ఇష్టారాజ్యంగా పొడిచాడు. నేను వారి బైక్‌ కీ తీసుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశాను. అయినా వాళ్ళు తప్పించుకున్నారు. రక్తం ఓడుతున్న నేను సహాయం కోసం అర్ధించాను. కానే ఎవ్వరూ తన వాహనాన్ని ఆపలేదు. దీంతో 5 కిలోమీటర్ల దూరంలోని చిన్మయ ఆస్పత్రివైపు నడక మొదలుపెట్టి.. రెండున్నర కిలోమీటర్లు నడిచాను. అప్పటికే నా దుస్తులు రక్తంతో పూర్తిగా తడిచిపోయాయి. నా బాధ చూసిన ఓ వ్యక్తి ఆటో ఎక్కించి.. చిన్మయ ఆస్పత్రికి తరలించాడు..’’ అని ఆనాటి ఘటనను చెప్పుకొచ్చారు సంతోష్‌. ‘ఇదంతా జరిగేసరికి రాత్రి 10.30 గంటలైంది. అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాలతో బయట పడ్డాను..’ అన్నారు ఆ ఐటీ ఉద్యోగి. కత్తిపోటు నా కిడ్నీలకు సెంటీమీటర్ల దూరంలో ఆగిపోయాయి. లేకపోతే ప్రాణాలుపోయుండే వని చెప్పారు సంతోష్‌. బాధితుడు చెప్పిన ఆనవాళ్ళ మేరకు నిందితుల్లో ఒకరిని రౌడీషీటర్‌గా పోలీసులు గుర్తించారు.

 

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

62 − 55 =