స్టార్ ని కాదు.. యాక్టర్ ని అవుతా?

‘‘ప్రత్యేకంగా నాకొక ఇమేజ్‌ వద్దు కాబట్టే ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు చేస్తున్నా. స్టార్‌ హీరో అనిపించుకోవాలని నాకేమీ లేదండీ. నిజాయితీగా చెప్పాలంటే ఓ నటుడిగా ఉండాలనుకుంటున్నా’’ అని చెప్పారు వరుణ్‌తేజ్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘లోఫర్‌’ సినిమాలో ఆయన కథానాయకుడిగా నటించారు. సి.కె. ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఓ వైపు వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతూనే పూరి జగన్నాథ్‌ కార్యాలయంలో పత్రికలవారితో సంభాషించారు వరుణ్‌.
‘‘నాకు ‘లోఫర్‌’ కొత్త తరహా సినిమా. కథ చెప్పిన వారానికి పూరిగారు టైటిల్‌ ‘లోఫర్‌’ అని చెప్పినప్పుడు షాకయ్యాను. షూటింగ్‌ చేస్తున్నప్పుడు, తర్వాత రషెస్‌ చూసినప్పుడు ఆ టైటిల్‌ కరక్టేననిపించింది. ఈ టైటిల్‌ నచ్చనివాళ్లు సినిమా చూశాక అభిప్రాయం మార్చుకుంటారు. ‘కంచె’ షూటింగ్‌ పూర్తయిన వెంటనే ఒకరోజు గ్యాప్‌తో ‘లోఫర్‌’ షూటింగ్‌ మొదలైంది. ఈ కేరక్టర్‌లో ఇమిడిపోవడానికి పూరిగారే సాయపడ్డారు. నాచేత ఆయన బాగా చేయించారు. అమ్మ సెంటిమెంట్‌ ఈ సినిమా కథకు ఆత్మ అని చెప్పాలి. నేను ఈ స్ర్కిప్టు ఒప్పుకోడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి. దానికి సంబంధించిన సన్నివేశాలు వింటున్నప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చారు. తల్లీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలకు బాగా కనెక్టయ్యాను. రేవతిగారు ఆ పాత్ర చెయ్యడం, ఆమె కొడుకుగా నేను నటించడం ఆనందంగా ఉంది. షి డిడ్‌ ఎ ఫాబ్యులస్‌ జాబ్‌.
అమ్మ సెంటిమెంట్‌పై సుద్దాల అశోక్‌తేజ్‌గారు రాసిన ‘సువ్వీ సువ్వాలమ్మా’ పాటను చిత్రీకరించేప్పుడు అందులోని ఎమోషన్‌ను తట్టుకోలేక మొదటిరోజు ఆ పాటను చెయ్యలేకపోయా. పూరిగారు కూడా ఆ రోజు షూటింగ్‌ కేన్సిల్‌ చేశారు. తర్వాత మూడు రోజుల్లో ఆ పాటను పూర్తిచేశాను. దానిలో బాగా చేశానని ఆయనన్నారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకులం కలిసి దొంగతనాలు చేస్తుంటాం, కలిసి మందు కొడుతుంటాం. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. నా తండ్రిగా పోసానిగారు చేశారు.
నేను మాస్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నించడం లేదు. మాస్‌ కేరక్టర్‌ కూడా వరుణ్‌ బాగా చేశాడనిపించుకుంటే చాలు. మా ఫ్యామిలీలో అందరూ మంచి నటులే. అందుకే ఇంత పెద్ద ఇండస్ట్రీలో అందరూ మనగలుగుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇంతకాలానికి ఓ స్టార్‌ కాకుండా యాక్టర్‌ వచ్చాడని నిన్ననే విజయవాడలో ఒకరంటే, యాక్టర్‌ కాకుండా స్టార్‌ అవడని చెప్పాను. పెదనాన్న (చిరంజీవి) సినిమాల్లో నన్ను రీమేక్‌ చేయమంటే ‘ఛాలెంజ్‌’ చేస్తాను. ఆ సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు రెండు నెలలు విశ్రాంతి తీసుకొని, ఆ తర్వాత సినిమా చేస్తాను. క్రిష్‌తో ఓ సినిమా ఉంటుంది. ఆయన కథ చెప్పారు. నచ్చింది’’ అని వివరించారు వరుణ్‌.
vv
Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

59 + = 60