ముగిసిన కార్తీక మాసం – పెరిగిన కోడి మాంసం

  • ముగిసిన కార్తీక మాసం
  • పెరిగిన అమ్మకాలు
  • కిటకిటలాడిన నాన్‌వెజ్‌ దుకాణాలు

కార్తీక మాసం వెళ్లింది.. నాన్‌ వెజ్‌ దుకాణాలకు కళ తెచ్చింది.. కార్తీక మాసం సందర్భంగా గత నెల రోజులుగా ప్రతీ ఇంటిలోనూ మాంసాహార పదార్థాలను దూరంగా పెట్టారు. అయితే శనివారం కార్తీకమాసం ముగిసింది.. అంతే ఆదివారం అంతా నాన్‌ వెజ్‌ దుకాణాల బాట పట్టారు. దీంతో ఉదయం నుంచి దుకాణాలు కిటకిటలాడాయి.. ఒక్క చికెన్‌ తప్ప మిగిలినవన్నీ అధిక ధరలకు విక్రయించారు. ఒక్క రోజు వ్యాపారం ఎంతో తెలుసా అక్షరాలా రూ. 2 కోట్లు.. ఇదీ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే నాన్‌వెజ్‌ వ్యాపారం లెక్క..

జిల్లాలో ఆదివారం రికార్డు స్థాయిలో చేపలు, మాంసం విక్రయాలు జరిగాయి. కార్తీకమాసం ముగియడంతో మాంసాహారుల ఇళ్ళల్లో నాన్‌వెజ్‌ వంటకాలు ఘుమఘుమలాడాయి.మరోవైపు చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. ఉదయం నుంచే కస్టమర్ల సందడి కనిపించింది. సముద్ర చేపలు, రొయ్య, పీత తదితర రకాల మత్స్యసంపద కొనేందుకు మాంసప్రియాలు పోటీపడ్డారు. దీంతో మార్కెట్‌కు వచ్చిన సరుకుకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఇటు చెరువు చేపలను కూడా విడిచిపెట్టలేదు. చేపల విక్రయాలు ఎక్కడ జరిగితే అక్కడ రద్దీ కనిపించింది. ఇదే సందడి మేక, కోడి దుకాణాల వద్ద కూడా నెలకొంది. దీంతో జిల్లాలో మత్స్య, మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. సుమారు రూ.2 కోట్లపైనే విక్రయాలు జరిగాయని అంచనా.

కిటకిటలాడిన హోటళ్ళు..

మరో వైపు నాన్‌వైజ్‌ హోటళ్లు, రెస్టారెంట్లు కిటకిటలాడాయి. రాత్రి పది గంటలు దాటినా రద్దీ తగ్గలేదు.కుటుంబ సమేతంగా వచ్చి చాలా మంది ఇష్టమైన వంటకాలను అరగించారు. దీంతో హోటళ్ళ బిజినెస్‌ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. దీనికి కారణం కార్తీకమాసం ముగిసిన మురుసటి రోజునే ఆదివారం రావడం. ఈ సారి కార్తీకమాసంలో చాలా మంది మాంసాహారప్రియులు నాన్‌వెజ్‌ను ముట్టలేదు. నెల రోజుల పాటు ఉపవాసం దీక్షలో ఉన్నారు. ఈ కారణంగా మాంసాహారప్రియులు ఇళ్ళలో నోరుకట్టేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ముక్కలేనిదే ముద్దదిగని ప్రియులు హోటళ్లకు వెళ్లి అరగించే వారు. నెల రోజుల పాటు ఈ కష్టాలు పడ్డారు. శనివారంతో కార్తీకమాసం పూర్తయింది. అయితే చివరి రోజున దీపాలు వెలిగించడంతో చాలా మంది శనివారం కూడా నాన్‌వెజ్‌ ఇళ్ళల్లో వండలేదు. దీంతో ఆదివారం ఒక్కసారిగా డిమాండ్‌ వచ్చిపడింది. చాలా మంది ఇళ్ళల్లో రెండు మూడు రకాల నాన్‌వెజ్‌ వంటకాలు చేశారు. జిల్లాలోని అన్ని పట్టణ, మండల కేంద్రాలు, గ్రామాల్లో కూడా మాంసం అమ్మకాలు జోరుగా సాగాయి. సాయంత్రం కూడా షాపుల వద్ద ఇదే సందడి కనిపించింది.
ధర పెరిగినా..

చేపలు, రొయ్యల అమ్మకాలు మాత్రం గతం కంటే ఎక్కువ ధరకు విక్రయించారు. పండుగొప్ప కేజీ రూ. 700 పలికింది. అలాగే కోయాంగ రకం కేజీ రూ 400 విక్రయించారు. ఇక కేజీ రొయ్యలు రూ. 300 పలికాయి. అది కూడా సైజ్‌ను బట్టి, పెద్ద రకం రొయ్యలు, గోదావరి రొయ్య రూ. 500 పలికింది. అయితే కస్టమర్లు ఎవరూ ధరను లెక్కచేయకుండా కొనుగోలు చేశారు. నెల రోజుల పాటు ముక్కకు దూరంగా ఉన్న మాంసాహార ప్రియాలు అదివారాన్ని పుల్‌గా ఎంజాయ్‌ చేశారు.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 8 = 2