ఆర్టీసీ కార్మికులుకు సొంత ఇల్లు కట్టించి ఇస్తామన్న ఎపి ప్రభుత్వం

  • కోరుకున్నచోట స్థలం.. ఇంటి నిర్మాణం
  • తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం
  • చంద్రబాబు ఎన్నికల హామీ నెరవేర్చేందుకు సిద్ధం
హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. కార్మికులందరికీ స్థలాలు, ఇళ్లు సమకూర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 126 డిపోల్లో పనిచేసే 60 వేల మంది ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి స్థిర నివాసం కల్పించబోతున్నది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నడుం బిగించాయి. ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులకు స్థిర నివాసం కల్పిస్తామని చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకు కార్మిక పరిషత నాయకులు చంద్రబాబు వద్దకెళ్లి ఈ విషయాన్ని గుర్తు చేశారు.
దీనిపై అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఐఏఎస్‌ అధికారి లవ్‌ అగర్వాల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో చర్చించి మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఆయా డిపోల పరిధిలో స్థలంతోపాటు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కార్మికులు తాము పనిచేసే డిపోల పరిధిలో వద్దంటే రాష్ట్రంలో ఎక్కడైనా స్థలం ఇస్తారు. ఆయా నగరాలు, పట్టణాల్లో 500 నుంచి 2 వేల గజాల వరకూ ఎక్కడ స్థలం అందుబాటులో ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కార్మికుల నుంచి దరఖాస్తులు తీసుకొని అక్కడ వారికి ఆ స్థలాన్ని కేటాయిస్తుంది. కార్మికుడి జీతాన్ని పరిగణలోకి తీసుకొని (25 శాతం టేక్‌ హోం ఉండేలా) అతి తక్కువ వడ్డీతో బ్యాంకు నుంచి రుణం ఇప్పించి స్థలం కేటాయిస్తారు. ఆ తర్వాత కార్మికులు ఇళ్లు నిర్మించుకొనేందుకూ ప్రభుత్వం ఇదే పద్ధతిలో సహకరిస్తుంది. ఆర్టీసీ కాలనీలకు మాత్రం నీరు, విద్యుత, డ్రైనేజీ, రోడ్లు వంటి సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుంది.

ఈ వ్యవహారాన్ని పూర్తి చేయడానికి రాష్ట్రస్థాయిలో ఆర్టీసీకి ప్రత్యేకంగా హౌసింగ్‌ సొసైటీ ఏర్పాటు చేసి, డిపోల వారీగా అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులను ఇందులో ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఈ విధానాల్లో మార్పు చేర్పులపై చర్చించేందుకు ఈ నెల 10న అధికారులు, కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, లవ్‌ అగర్వాల్‌ విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎంప్లాయిస్‌ యూనియన (ఈయూ) రాష్ట్ర ప్రధాన, ఉప ప్రధాన కార్యదర్శులు పద్మాకర్‌, పలిశెట్టి దామోదర్‌ రావు, వైవీ రావు స్వాగతిస్తూనే కొన్ని సూచనలు చేస్తున్నారు. 25 శాతం టేక్‌ హోమ్‌ అనే నిబంధనతో చాలామంది అర్హత కోల్పోతారని అంటున్నారు. ఇప్పటికే సీసీఎస్‌ రుణాలు ఉన్నందున ఈ నిబంధనను సడలించాలని కోరుతున్నారు. ఎనఎంయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా చంద్రయ్య, శ్రీనివాసరావు, పీవీ రమణా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఆర్టీసీ కార్మికులు ఓ ఇంటి వారవడం సంతోషకరమన్నారు. నిబంధనలను పూర్తిగా పరిశీలించాక స్పందిస్తామని చెప్పారు. కార్మిక పరిషత నాయకుడు వీవీ నాయుడు సీఎం చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

72 − 71 =