ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం ఫలిస్తుందా..?

1438710892.219281-copyకొలంబో : శ్రీలంకకు టీమిండియా చేరుకుంది. భారత జట్టు ఇక్కడ మూడు టెస్టుల్లోనూ, రెండు టీ20 ట్వంటీల్లోనూ పాల్గొంటుంది. ఈ పర్యటనకు బయలుదేరే ముందు చెన్నైలో భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాట్లాడుతూ ముగ్గురు స్పిన్నర్ల వ్యూహానికి అనుకూలంగా మాట్లాడాడు. ‘ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంది. 20 వికెట్లూ సాధించడానికే ఈ ఆలోచన. ఈ ఆలోచనతో జట్టులో బౌలర్లు తమ సత్తాను మరింతగా ప్రదర్శిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను.’ అని విరాట్‌ తెలిపాడు. ఈ సిరీస్‌లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి విరాట్‌ కోహ్లి ఎప్పటి నుంచో భావిస్తున్నాడు. అయితే, ఈ ముగ్గురు స్పినర్ల వ్యూహాంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాంతో జట్టుకు ఎక్కువగా ప్రయోజం కలగదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి శ్రీలంక పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. కానీ భారత స్పినర్లు శ్రీలంకలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నట్లుగా కనిపించదు. నిజానికి అక్కడ భారత స్పిన్నర్ల కంటే భారత పేసర్లే ఎక్కువగా ఆకట్టుకున్నారు. ఇక్కడ గత 18 మ్యాచుల్లో మన స్పిన్నర్లు 110.6 స్ట్రయిక్‌ రేట్‌తో, 53.17 సగటుతో వికెట్లు సాధించారు. పేసర్ల విషయానికి వస్తే 68.4 స్ట్రయిక్‌ రేట్‌తో, 38.67 సగటుతో వికెట్లు సాధించారు. ప్రస్తుత భారత జట్టు హర్భజన్‌ సింగ్‌, అమిత్‌ మిశ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పిన్‌ త్రయంతో బరిలోకి దిగుతుంది. వీరిలో హర్భజన్‌, మిశ్రాలకు శ్రీలంకలో ఆడిన అనుభవం ఉండగా, శ్రీలంకకు రావడం అశ్విన్‌కు ఇదే తొలిసారి. హర్భజన్‌, మిశ్రాల రికార్డు కూడా ఇక్కడ గొప్పగా లేదు. అలాగే, గతంలోనూ శ్రీలంకలో ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాన్ని భారత్‌ అమలు చేసింది. 1985, 1993, 1997 పర్యటనల్లో భారత్‌ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. 1985లో గోపాల్‌ శర్మ, రవిశాస్త్రి, మణిందర్‌ సింగ్‌లతో బరిలోకి దిగిన భారత్‌, 1993లో అనిల్‌ కుంబ్లే, రాజేష్‌ చౌహాన్‌, వెంకటపతి రాజు బరిలోకి దిగింది. 1997లో అనిల్‌ కుంబ్లే, నిలేష్‌ కులకర్ణి, రాజేష్‌ చౌహాన్‌లు ఉన్నారు. అయితే ఈ మూడు సార్లు మన స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరి ఈ సారి కూడా మన స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత రెండేళ్లలో శ్రీలంకలో జరిగిన వివిధ టెస్టు సిరీస్‌లను పరిశీలిస్తే స్పిన్నర్ల ప్రభావం అంతంత మాత్రమే. ఇటీవలే శ్రీలంక-పాకిస్థాన్‌ టెస్టు సిరీస్‌లోనూ స్పిన్నర్లు రాణించలేకపోయారు. మరి విరాట్‌ కోహ్లి తన ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాంపై పునరాలోచించుకోవాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

34 − 33 =