ఆ చిన్నారి మరణం ప్రమాదం కాదు… …!

hema-malini-accidentఅది మధుర, జైపూర్ మధ్యలో ఉన్న దౌసా ప్రాంతం… అర్ధరాత్రి అతివేగంగా దూసుకొచ్చిన ఓ బెంజ్ కారు ఎదురుగా వస్తున్న ఓ ఆల్టో కారును గుద్దింది. ఆల్టో నుజ్జు నుజ్జు అయ్యింది. ఆల్టోలోని హర్ష్ కండేల్వాల్, శిఖా, సీమ, మరో ఇద్దరు చిన్నారులు సోమిల్, సోనమ్(చిన్ని) ఈ ఐదుగురు సభ్యుల కుటుంబం మొత్తం చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్నారు. ఆ ఐదుగురు పేర్లున్న అనామకులు… అభాగ్యులు… ఈ దేశపు సాధారణ పౌరులు… ఓటు వేసేటప్పుడు తప్ప పాలకులకు గుర్తురానివాళ్ళు… ఇక బెంజ్ కారులో ఉన్న మరో మహిళకు ముఖం మీద గాయాలయ్యాయి. కానీ బాగానే ఉంది. నడుస్తుంది… మట్లాడుతుంది… ఆదేశాలిస్తుంది… ఆమె ఒక సెలెబ్రిటీ… డ్రీమ్ గర్ల్… వందలాది సినిమాల్లో యువతను ఉర్రూతలూగించిన హీరోయిన్… అంతకుమించి ఘనత వహించిన మన దేశ పార్లమెంట్ మెంబర్… ఆమె పేరు హేమామాలిని…
ఇంతలో అక్కడకు ఓ కారొచ్చింది. అందులోంచి దిగిన పెద్దమనిషి హేమామాలినిని తన కారెక్కిచ్చుకొని హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. ఆ పక్కనే చావుబతుకుల మధ్య కొట్లాడుతున్న మరో ఐదుగురున్నారన్నవిషయం కూడా ఆ పెద్దమనిషి కానీ, హేమామాలిని కానీ పట్టించుకోలేదు. ఆ ఐదుగురు దాదాపు అరగంటపాటు రోడ్డు మీదనే తమను రక్షించేవారికోసం ఎదురు చూశారు. అధికారులు హేమామాలినిని ఎస్సెమ్మెస్ అనే పెద్ద కార్పోరేట్ ఆస్పత్రి కి తరలించారు.అయితే ఆ కుటుంభాన్ని ఓ ఆటోలో ఎక్కించి చిన్న ఆస్పత్రికి తీసుకెళ్ళారు. చివరికి ఆసుపత్రికి తీసుకెళ్ళిన కొద్ది సేపటికే చిన్నారి సోనమ్(చిన్ని) చనిపోయింది. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత వారిని కూడా ఎస్సెమ్మెస్ ఆస్పత్రికి తరలించారు.

హేమామాలినికి గాయాలవ్వడం దురదృష్టకరం… కానీ అదే ప్రమాదంలో ఓ చిన్నారి మరణించడం మరింత బాధాకరం… ఆ చిన్నారిని రక్షించే అవకాశం ఉండి కూడా ఆ ప్రయత్నం చేయకపోవడం బాధాకరం కాదు… దుర్మార్గం. వారిని రక్షించాలన్న ఇంగిత జ్ఞానం హేమామాలినిని రక్షించిన పెద్దమనిషికి లేకపోవచ్చు గానీ…అధికారులకు, ప్రజా ప్రతినిధి అయిన హేమామాలినికి లేకపోవడం క్షమించరాని దుర్మార్గం… వారి కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఒక కుటుంబం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది.

జనాలకు సినిమా నటులమీద, రాజకీయులమీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేకపోవడం, కనీసం పసిపాపల మీద కూడా లేకపోవడం మన దేశ దౌర్భాగ్యం. తమ జీతాలు, తమ బత్యాలు, తమ సౌకర్యాలు, తమ కమీషన్లు, తమ స్వార్ధం తప్పప్రజల గురించి ఆలోచించని ప్రజా ప్రతినిధులు రాజ్యమేలుతున్న మన దేశంలో ఇక సినీ మాయా ప్రపంచం లోంచి వచ్చిన హేమామాలిని లాంటి వాళ్ళనుంచి ఇంతకంటే మనం ఎక్కువగా ఆశించలేం. మీడియాలో, సోషల్ మీడియాలో హేమామాలిని చర్యపై తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత సర్దుకున్న ఆ మహానటి చనిపోయిన చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటన చేసింది. అందులో ఎక్కడా పశ్చాత్తాప ఆనవాళ్ళు మాత్రం కనిపించలేదు. చివరిగా ఒక్కమాట హేమామాలినిని తీసుకొచ్చిన సమయంలోనే ఆ చిన్నారి చిన్నిని ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఆ చిన్నారి బతికేది. అంటే చిన్నారి మరణం ప్రమాదం వల్లకాదు… అది ఒక హత్య… దానికి కారణం ఎవరనేది మీరే నిర్ణయించుకోండి…
ఎ ఒక్క మీడియా కూడా వీళ్ళ గురించి చెప్పడం లేదు..shame on media,

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 1 = 8