“Ippa Puvvu” and its importance

ippapuvvu
గిరిజనులకు ప్రీతిపాత్రమైన విప్పపూలు ప్రతీ ఏడాది మార్చి 2వ వారం నుంచి అందుబాటులోకి వస్తాయి. పూలు రాలడం, వాటిని ఏరుకోవడం, ఎండబెట్టడం ఇదంతా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. విప్పపూలను దోరగా వేయించుకోవడంతో పాటు ఉడక బెట్టి ఆహారంగా తీసుకుంటారు. అంతేకాకుండా విప్పపూలతో సారాను తయారు చేసి సేవించడం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇంతటి ప్రాముఖ్యత గలిగి, గిరిజనుల ఆరాధ్యదైవంగా భావించే విప్ప చెట్లు అడవుల్లో అంతరించి పోతున్నాయి. దీంతో రోజురోజుకు వాటిపై ఆధారపడిన గిరిజనులకు ఇబ్బందులు ఎదురుఅవుతున్నాయి.

పోడు నరికే సమయంలో విప్పచెట్లను నరకకుండా, మిగతా పొదలను శుభ్రంచేసి వ్యవసాయం చేసుకొనే గిరిజనులు వారివారి భూముల్లో ఉండే విప్ప చెట్లపై గొడ్డలి వేటు పడకుండా కాపాడుకుంటున్నారు. అడవుల్లో సహజంగా ఉండే విప్పచెట్లు మాత్రం స్మగ్లర్ల వేటుకు నేల రాలిపోతున్నాయి. ఆకురాల్చి మొగ్గలు వేసే సమయంలో చెట్టుకింద దట్టంగా ఉన్న చెత్తాచెదారాన్ని, రాలిన ఆకులను ముందుగా శుభ్రం చేసుకుంటారు గిరిజనులు. దీంతో పక్వానికి వచ్చిన పూలు తెల్లవార్లూ చెట్టు నుంచి రాలుతుంటాయి. ఇందులో విశేషమేమిటంటే రాత్రి సమయంలో పూలు రాలి పోవడం, పగటి సమయంలో ముసుకు పోవడం ఈ చెట్టు యొక్క లక్షణం. పూలనుంచి వెదజల్లే కమ్మటి సువాసనకు ఎలుగుబంట్లు, విషసర్పాలు చెట్ల వద్దకు వచ్చి తెల్లగా ఉండే ఈ పూలను ఏరుకొని తింటాయి. పశువులు మాత్రం వాసన తగిలితే పూలు ఏరుకొనే చెట్టు యజమానికి ఒక్క పూవు కూడా దొరకని పరిస్థి తి ఏర్పడుతుంది. ఈ కారణంగా ప్రమాదమైనప్పటికినీ తెల్లవారుజామునే 3 గంటల ప్రాంతంలో చెట్ల వద్దకు చేరుకొని చప్పుడు చేసి పూలను ఏరుకొని పొద్దుపొడిచే సరికి ఇళ్ల వద్దకు చేరుకొని కళ్లాల్లో ఆరబెడతారు. 10 రోజులపాటు ఆరిన తరువాత ఎదురు గంపల్లో దాచుకొని తొలకరి సమయంలో తమతమ అవసరాలకు ఉపయోగించుకుంటారు.

భద్రాద్రి రాముని ప్రసాదం కూడా విప్పపూవే..
భగవాన్‌ శ్రీసీతారామచంద్రమూర్తి యొక్క భక్తురాలు శబరి రాముడికి నైవేద్యంగా తాటిపండుతో పాటు విప్పపువ్వును కూడా సమర్పించినట్లు పురాణాల్లో పేర్కొనడంతో, విప్పపువ్వుకు కూడా చరిత్రలో స్థానం దక్కినట్ల యింది. ఈ కారణంగా భద్రాచలం స్వామివారి ఆలయం వద్ద విప్పపువ్వు ప్రసాదం ప్యాకెట్లను భక్తులు తప్పనిసరిగా కొనుగోలు చేసి, కళ్లకు అద్దుకొని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత గల విప్పపువ్వు క్రమక్రమంగా అంతరించి పోవడం విచారకరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

62 − 56 =