తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే

tirumala-hills2తిరుమల గిరుల ప్రాంతం అంతటి ప్రాశస్త్యం కలిగినది. అలాగే ఆలయంలో ఎన్నో యేళ్ళ చరిత్ర కలిగిన విగ్రహాలు, ప్రాంతాలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుంటూ పోతే ఒక జీవిత కాలం సరిపోదని పురాణాలే చెబుతుంటాయి. అలాంటి తిరుమల శ్రీవారి ఆలయంలో నిద్రపోని చెంతచెట్టు ఉండేదట. మీరు విన్నది కరెక్టే. ఎప్పుడూ స్వామివారి మూలవిరాట్ ముందు నిద్రపోకుండా మేలుకొని సేవ చేస్తుండేదట. అసలు ఈ చింతచెట్టు ఎప్పుడు, ఎక్కడ ఉన్నదో తెలుసుకుందామా…!
ఎన్నో యేళ్ళ కిందట సంపంగి ఆవరణ మార్గంలో పడికావలి గోపురానికి దగ్గరగా ఒక పెద్ద చింతచెట్టు ఉండేదట. దానికి కొమ్మలు, రెమ్మలు శాఖోపశాఖలుగా పెరిగి అతి విశాలంగా వ్యాపించి ఆ చెట్టునీడ ఎటూ తిరగక ఆ వృక్షమూలంలోనే స్థిరంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల అది నీడ తిరుగని చింతచెట్టుగా ప్రసిద్ధి చెందింది. అంతమాత్రమే కాదు అది నిద్రపోని చింతచెట్టుగా కూడా పురాణాలు చెబుతున్నాయి. చెట్టులోని శాఖలు కొన్ని చిగురించగా, మరికొన్ని శాఖలు పుష్పించగా ఇంకొన్ని శాఖలు కాయలు పండ్లు కాస్తూ ఉండేది. ఇలా అన్ని కాలాల్లో విశ్రాంతి అనేది ఎరుగక ఆ చెట్టు నిరంతరం చిగురించడం, పుష్పించడం, ఫలించడం వల్ల అది నిద్రపోని చింతచెట్టుగా పిలువబడింది.
ఆ చెట్టు కింద పుట్టలో శ్రీనివాసుడు కొంతకాలం దాగి ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత ఆ స్వామివారు విగ్రహమూర్తిగా స్వయంభువ వెలసి ఆ పుట్టలోనే నిక్షిప్తమై ఉన్నాడు. ఆ నీడ తిరుగని నిద్ర ఎరుగని చింతచెట్టు సాక్షాత్తు వసుదేవుడనీ, ఆదిశేషుడనీ ఆ చెట్టుకింద పుట్ట దేవకీదేవి అని పురాణాలు పేర్కొంటున్నాయి. మొట్టమొదట గోపీనాథుడనే వైఖానస విప్రుడు ఈ క్షేత్రానికి వచ్చి పుష్కరిణికి దక్షిణతీరంలో చింతచెట్టు కింద ఉన్న పుట్టలో ఉన్న శ్రీ వేంకటేశ్వరుని దర్శించి పుట్టలోని ఆ స్వామివారి విగ్రహాన్ని పుష్కరిణి పశ్చిమ తీరంలో పునఃప్రతిష్టించి ఆనాటి నుండి అక్కడే ఉంటూ ఆ స్వామివారికి అర్చన పూజాదికములు చేస్తూ ఉండేవారట.
ఆ తరువాత రంగదాసు అనే భక్తుడు కూడా ఆ క్షేత్రానికి వచ్చి ఒక బావి త్రవ్వి సంపంగి, చామంతులు వంటి చెట్లను పెంచి శ్రీ స్వామివారి పూజకు అసరమయ్యే పూలను, పండ్లను తెచ్చి సమర్పిస్తూ అర్చకుడైన గోపీనాథునికి సహాయంగా ఉండేవాడట. ఈ రంగదాసే మరుజన్మలో తొండమానురాజుగా జన్మించి శ్రీనివాసస్వామికి గోపుర ప్రాకారాదులు నిర్మించాడట. ఆ సందర్భంలో తనకు ప్రీతిపాత్రమైన ఆ చింతచెట్టుకు కొద్దిదూరంలోనే నైరుతి మూలకు ఉంటూ లక్ష్మీదేవికి ఆవాస స్థానమై అత్యంత ప్రియమై ఎల్లప్పుడూ పుష్పిస్తున్న ఉన్న చంపక వృక్షాన్ని మాత్రం రక్షించి ఇక మిగిలిన చెట్లను తొలగించి ఆలయ ప్రాకారాదులు నిర్మించవలసిందన్న శ్రీ వేంకటేశ్వరుని ఆదేశాన్నితొండమానుడు నిర్వర్తించాడని వేంకటాచలమహత్య్మం అనే గ్రంథం తెలుపుతూ ఉంది.
శ్రీ వేంకటేశ్వరుని కంటే ప్రాచీనమై వెలుగొందిన ఈ నీడ తిరుగని చింతచెట్టు చంపకవృక్షాలు నేడు కానరావు కానీ ఇటీవల కాలంలో అంటే భగవద్రామానుజులవారు కూడా ఈ చింతచెట్టును దర్శించినట్లుగా తిరుగని చింతలు దెరలించు నీడదిరుగని చింత కెంతే భక్తి మొక్కినట్లుగా పరమయోగి విలాసం అనే గ్రంథంలో రాయబడింది. అంతేకాదు ఈ చెట్లను దర్శించి రామానుజులు వాటికి నిత్యమూ పూజాదికములు నిర్వహించే ఏర్పాట్లను కూడా కావించినట్లుగా శ్రీ వేంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం పేర్కొనబబడింది. తరువాత 15వ శతాబ్దంలో తాళ్ళపాక అన్నమాచార్యులు కూడా తొలిగా వేంకటాచల యాత్ర చేసిన సమయంలో మహద్వారం లోపల ఉన్న నీడ తిరగని చింతచెట్టును దర్శించి సేవించినట్లుగా తెలుస్తోంది.
పూర్వం ఈ సంపంగి ప్రదక్షిణ ఆవరణలో నుండే నేరుగా పుష్కరిణికి వెళ్ళడానికి వీలుగా ఉండేదని అంటే ఆలయ మహాప్రాకారం ఉండేది కాదని తెలుస్తోంది. తరువాత కాలంలో మహాప్రాకారం ఆ మహాప్రాకారానికి ఆనుకొని లోపలివైపు చుట్టూరా సంపంగి ప్రదక్షిణ మార్గంలో సుమారు 18 అడుగుల వెడల్పుతో ఉన్న మండపాలు ఇంకా ఇతర నిర్మాణాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఈ ఆవరణ మార్గంలో కళ్యాణమండపంలో తప్ప మిగిలిన చోట్ల యాత్రికులకు ప్రవేశం లేదు.
ఈ సంపంగి ప్రదక్షిణ మార్గంలో దక్షిణం వైపున కళ్యాణమండపం ఉంది. పడమటి దిక్కున ఉన్న మండపాలు చక్కెర, శెనగపప్పు, శెనగపిండి, బెల్లం వంటివి నిల్వ ఉంచడానికి ఉపయోగపడే గదులుగా ఉన్నాయి. ఈ మార్గంలోనే వాయువ్య మూలకు ప్రసాదం తయారీలోను, స్వామివారి సేవలోను వినియోగించే కర్పూరం, చందనం జీడిపప్పు, ద్రాక్ష, నెయ్యి వంటి వస్తువులను పంపిణీ చేసే ఉగ్రాణం అనబడే కొట్టడి (ప్రసాదాల తయారీ కేంద్రం) ఉంది. ఈ ఉగ్రాణానికి ముందు భాగాన విరజానది అనే తీర్థం కూడా ఉంది.
సంపంగి ప్రదక్షిణ మార్గంలో ఉత్తరం వైపున పడిపోటు అనబడే వంటశాల ఉంది. ఈ పడిపోటు వద్ద ఉండే బావిని పోటుబావి అంటారు. ఈ వంటశాల నందు వంటలకు ఈ బావి నీళ్ళనే ఉపయోగిస్తారు. పడిపోటుకు పక్కన తూర్పున యమునాత్తురై అని పిలువబడే పూల అర ఉంది. దాన్ని ఆనుకుని తూర్పు దిక్కున ఉన్నదే వగపడి అర. పూల అరకు ఎదరుగా పూల బావి కూడా ఉంది. సంపంగి ప్రదక్షిణ మార్గంలో నాలుగుమూలల్లో నాలుగు స్థంభాల మండపాలు కూడా ఉన్నాయి.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *