Durga Maa Dussehra Importance and Procedure to Worship

పండగల్లో దసరా అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరకూ ఇష్టమైన పండగే. ముఖ్యంగా విజయదశమి అంటే మరీ ఇష్టం. ఎందుకంటే, చెడుపై మంచి సాధించే అంతిమ విజయానికి ప్రతీక. ఇక దసరా ఉత్సవాల్లో ప్రధానంగా అమ్మవారిని కొలుస్తారు. పదిరోజుల పాటు వివిధ అలంకరణలతో అమ్మవారికి పూజలు చేస్తారు. జగన్మాత ఆదిపరాశక్తి. శక్తిస్వరూపిణి. అమ్మను నమ్ముకుంటే అపజయం ఉండదని భక్తుల విశ్వాసం. సంస్కృతికి స్త్రీయే ఆధారం. దసరా సెలవుల్లో ఉండే పిల్లలూ, ఇళ్లకు వచ్చే బంధువులూ, బంధాలు బలపడే ఈ దసరా పండుగలో లోగిళ్లు కళకళలాడే ఈ శరన్నవ వేడుకలలో స్త్రీయే కీలక పాత్రధారి.

దేవీ నవరాత్రుల పేరుతో వ్యవహరిస్తారు. అమ్మలగన్న యమ్మ- ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగజ్జననిని ఆరాధించే నవరాత్రులనే దేవీ నవరాత్రులని అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఈ నవరాత్రులు మొదలవుతాయి. ఆ రోజు నుంచే శరదృతువు ప్రారంభం కావడంతో వీటిని శరన్నవరాత్రులంటారు. పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రి వేడుకలు జరుగుతాయి. పదోరోజైన దశమి నాడు దసరా పండుగ జరుపుకొంటారు. దీనినే విజయదశమి అంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన రోజు కావడం వల్ల విజయదశమి జరుపుకొనే ఆచారం వచ్చినట్లు చెబుతారు. ఇక ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి దేవీ నవరాత్రి సందడి ప్రారంభం కానుంది. నవరాత్రులలో అమ్మవారిని కొలిచే విధానం తెలుసుకుందాం..

dusserawishes

1. శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి..

అమ్మవారి తొలిరోజు అలంకరణ ఇది. స్వర్ణకవచంతో అత్యంత విశిష్టమైన రూపంతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే అష్టకష్టాలు తీరడమే కాకుండా, సమస్త దారిద్య్ర బాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.

2. శ్రీ బాలా త్రిపురసుందరీదేవి..

రెండో రోజు అభయముద్రతో బాలా త్రిపురసుందరీదేవి అలంకారం. ఆ రూపంలో ఉన్న బాలా త్రిపురసుందరీదేవిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగడమే కాకుండా, సత్సంతానం కలుగుతుందని ప్రతీతి.

3. శ్రీ గాయత్రీదేవి…

మూడో రోజు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనం. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని చెబుతారు.

4. శ్రీ మహాలక్ష్మి…

శ్రీమహాలక్ష్మి అలంకరణ. మూడు శక్తులలో ఒకటైన శ్రీమహాలక్ష్మి రూపాన్ని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సమస్త సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

5. శ్రీ అన్నపూర్ణాదేవి…

ఐదో రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం. సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించే అమ్మవారిని అన్నపూర్ణ రూపంలో దర్శించుకుని, పూజిస్తే ఆకలి దప్పుల వంటి బాధలు ఉండవు.

6. శ్రీ లలితా త్రిపురసుందరీదేవి..

ఆరో రోజు లలితా త్రిపురసుందరీదేవి అలంకారం. లక్ష్మీ సరస్వతులు వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా దర్శనమిచ్చే లలితా త్రిపురసుందరిని కొలిస్తే సమస్త దుఃఖాలు తొలగుతాయి.

7. శ్రీ సరస్వతీదేవి..

చదువుల తల్లి సరస్వతీదేవి రూపం. బుద్ధిప్రదాయిని అయిన సరస్వతీ రూపంలో అమ్మవారిని దర్శించుకుని ఆరాధిస్తే బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.

8. శ్రీ దుర్గాదేవి…

కదంబం ఎనిమిదో రోజు అమ్మ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. సింహ వాహనంపై మహిషాసురుడిని వధిస్తున్న దుర్గాదేవి రూపాన్ని ఆరాధిస్తే శత్రుబాధలు నశిస్తాయి. సమస్త దుర్గతులు దూరమవుతాయని ప్రతీతి.

9. శ్రీ మహిషాసురమర్ధిని దేవి…

తొమ్మిదో రోజు మహిషాసురమర్ధిని. అష్టభుజాలతో ఒకచేత త్రిశూలాన్ని ధరించి, సింహవాహనంపై మహిషుడిని సంహరించిన రూపంలోని దేవిని కొలిస్తే సమస్త భయాలు తొలగి, ధైర్య స్థైర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

10. శ్రీ రాజరాజేశ్వరీదేవి…

పదో రోజు విజయదశమి నాడు అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తుంది. షోడశ విద్యాస్వరూపిణి, శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన దేవికి విజయ అని కూడా పేరు ఉంది. రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తే అన్నింటా విజయాలు కలుగుతాయని ప్రతీతి.

Comments

comments

You may also like...