BSNL offers Free Calls for Just Rs.2 Per Month

ఏ టెలికామ్ కంపెనీ ఇవ్వనంత తక్కువ ధరకే ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ అయితే పూర్తిగా ఫ్రీ. ఈ ఒక్క ప్రకటన సాంకేతిక ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. సామాన్య ప్రజానీకానికి కొండంత ఆశలా కనిపించింది. ఇక సీన్ కట్ చేస్తే ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఎలా సాధ్యమవుతుందంటూ విమర్శలు. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగుందనే అనుమానాలు. ఇందులో వాస్తవాలను, సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే ఫ్రీ కాల్స్ అంటే ఎవరు మాత్రం సిమ్ తీసుకోరు. రిలయన్స్ స్టోర్స్ దగ్గర జనం బారులు తీరారు. ఇది రిలయన్స్ జియో ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితి. ఇంతవరకూ ఒక ఎత్తు.
ప్రజలకు ఈ ప్రకటన మేలు చేస్తుందో, లేదో తెలియదు కానీ ఇతర టెలికామ్ కంపెనీలను మాత్రం నిండా ముంచింది. కోట్లలో నష్టాన్ని మిగిల్చింది. ఇండియా టెలికామ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఎయిర్‌టెల్, ఐడియా కంపెనీలకు నిమిషాల వ్యవధిలో ముఖేష్ అంబానీ మూడు చెరువుల నీళ్లు తాగించారని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. రిలయన్స్ జియో ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఇతర టెలికామ్ కంపెనీలు తమ కస్టమర్లు చేజారిపోకుండా కాపాడుకునేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. డేటా ప్యాక్స్ ధరను తగ్గిస్తూ ఎయిర్‌టెల్, ఐడియా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి.
 bsnl-free-calls
ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు రిలయన్స్ జియోను తట్టుకుని నిలబడటానికి నానా పాట్లు పడుతుంటే… ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం రిలయన్స్ జియోకు ధీటుగా పోటీ ఇస్తూ రోజుకో సరికొత్త ప్రకటన చేస్తోంది. 249 రూపాయలకే అపరిమిత ఇంటర్నెట్ అని ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. అయితే ఇది కేవలం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే. కానీ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లను పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచేలా, రిలయన్స్ జియోకు దిమ్మతిరిగేలా ఓ సరికొత్త ప్లాన్‌కు రూపకల్పన చేస్తోందని టెలికామ్ రంగంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. రిలయన్స్ జియో ఏ వ్యూహంతో అయితే కస్టమర్లను తన వైపుకు తిప్పుకుందో… అదే వ్యూహంతో బీఎస్‌ఎన్‌ఎల్ దెబ్బకొట్టాలని చూస్తోంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా ఫ్రీ వాయిస్ కాల్స్‌కు… ఫ్రీ వాయిస్ కాల్స్‌తోనే సమాధానం చెప్పేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ పక్కా ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది.
ఈ ప్లాన్ ప్రకారం బీఎస్ఎన్‌ఎల్ 2జీ, 3జీ వినియోగదారులకు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితంగా అందించాలని సంస్థ భావిస్తోంది. వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తేవాలని సంస్థ యోచిస్తోంది. దీని ప్రకారం 2-4 రూపాయల నెలవారి టారిఫ్‌తో వాయిస్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. రిలయన్స్ జియో ప్రకటించిన నెలవారి ప్లాన్ విలువ 149 రూపాయలు. దీనికంటే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ ఎన్నోరెట్లు తక్కువ. రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లన్నీ 4జీ వినియోగదారులకు మాత్రమేనని, కానీ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టబోయే ఫ్రీ కాలింగ్ సదుపాయం 2జీ, 3జీ కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు బుధవారం తెలిపారు. అయితే మొదట విడతలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ మెరుగ్గా ఉండే కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిస్సా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్లాన్‌ను అమల్లోకి తేవాలని సంస్థ భావిస్తున్నట్లు తెలిసింది.

Comments

comments

You may also like...