కౌలుదారుల రుణాలకు రుణ అర్హత కార్డులు లేదా సాగు ధృవీకరణ పత్రాలు

బ్యాంకర్ల సబ్ కమిటీ సిఫారసులు
భూ యజమానుల అనుమతితో కౌలుదారులకు రుణ అర్హత కార్డులు ఇవ్వాలని బ్యాంకర్ల సబ్ కమిటీ సిఫారసు చేసింది. భూ యజమాని అనుమతి లేని పక్షంలో సాగు ధృవీకరణ పత్రం ఇవ్వాలని, ఈ పత్రం ఆధారంగా బ్యాంకులు రుణ సహాయం చేయాలని, ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని, అలాగే, బీమా పథకం వర్తింపచేయాలని సబ్ కమిటీ సూచించింది. రుణ అర్హత కార్డులు, లేదా సాగు ధృవీకరణ పత్రం పొందిన కౌలు రైతులకు బ్యాంకులు రుణ సహాయం ఇచ్చితీరాలని కమిటీ సిఫారసు చేసింది. ఈ సమాచారం అంతటినీ ఒక పోర్టల్‌లో పొందుపర్చాలని సూచించింది. భవిష్యత్తులో ఈ సమాచారాన్ని రైతుమిత్ర గ్రూపులు, ఇతర గ్రూపులలోని బకాయి పడిన ఖాతాలతో సమన్వయపర్చాలని కోరింది.
ఈనెల 12న జరిగిన 195వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమన్వయ సమితి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏర్పాటైన ఐదు సబ్ కమిటీలు ఆయా అంశాలపై కూలంకుషంగా చర్చించి చేసిన సిఫారసులను మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంచారు. కౌలుదారులకు రుణ సహాయం, సంక్షేమ పథకాలను బ్యాంకు రుణాలకు అనుసంధానం చేయడం, బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ వ్యవస్థీకృతం, మౌలిక వసతుల ఏర్పాటు, చేనేత కార్మికులకు రుణ విముక్తి పథకాన్ని వర్తింపచేయడం కోసం వడ్డీ మాఫీ చేయడం, ఈమూ పెంపకం సంబంధిత ఐదు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆనాటి సమావేశంలో చేసిన సూచనల మేరకు ఈ సబ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఆయా అంశాలన్నింటిపై సబ్ కమిటీలు చర్చించి అవసరమైన సూచనలు చేశారు.
భూయజమాని అప్పటికే రుణం పొందిన సర్వే నెంబర్లలో మళ్లీ కౌలుదారుకు కూడా బ్యాంకు రుణం అందించడం కష్టతరమని సబ్ కమిటీ అభిప్రాయపడింది. దానికి పరిష్కారంగా రుణ అర్హత కార్డులు లేదా సాగు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని సిఫారసు చేసింది. కౌలుకు ఇచ్చిన భూములపై భూ యజమాని ఇతర రుణాలు పొందేందుకు బ్యాంకులు వీలు కల్పించవచ్చునని సూచించింది. భూపరిపాలన ఛీఫ్ కమిషనర్, వ్యవసాయ శాఖ రుణ అర్హత కార్డుదారులు, సాగు ధృవీకరణ పత్రదారుల సమాచారాన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాలవారీగా వెంటనే బ్యాంకులకు అందజేయాలని కోరింది. ఈ సమాచారాన్ని సంబంధిత బ్యాంకు నియంత్రణ విభాగాలతో పంచుకోవాలని తెలిపింది. అర్హత ప్రకారం ఈ రుణ అర్హత కార్డుదారులు, సాగు ధృవీకరణ పత్రదారులకు బ్యాంకు శాఖలు రుణాలు మంజూరుచేయాలన్నారు. రుణ సహాయం అందించలేని పక్షంలో బ్యాంకులు తగిన కారణాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి, బ్యాంకర్ల సమన్వయ సమితికి తెలియజేయాలని స్షఫ్టంచేసింది.
సంక్షేమ పథకాలను బ్యాంకు రుణాలకు అనుసంధానం చేసే అంశంపై ఏర్పాటైన సబ్ కమిటీ సిఫారసులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఓబీఎంఎంఎస్) పోర్టల్ ద్వారా ఒక నాన్ ఆపరేటీవ్ సేవింగ్స్ అకౌంట్, ఇంకొక జీరో బ్యాలెన్స్ లోన్ అకౌంట్ ఖాతాల నెంబర్లను అప్‌లోడ్ చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి. దీనివలన ఖాతాల సమాచారం పొందడంలో జాప్యాన్ని నివారించడానికి వీలవుతుంది. సంక్షేమ శాఖ ద్వారా అప్పటికే బ్యాంక్ రుణాలను పొందిన లబ్దిదారుల సమాచారాన్ని ప్రభుత్వాధికారులు వెంటనే బ్యాంకర్లకు అందించాలని సబ్ కమిటీ సూచించింది. దానికి సంబంధించిన బకాయిలను, చెల్లింపుల వివరాలను బ్యాంకులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంది.
కొత్త రుణాలు పొందడానికి స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన రుణ చెల్లింపు వివరాలను, సంఘాల ద్వారా ఏర్పాటుచేసిన యూనిట్ల వివరాలను బ్యాంకులకు అందజేయాలని సబ్ కమిటీ సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లబ్దిదారుల ఎంపిక మొదలు యూనిట్ల స్థాపన వరకు సంక్షేమశాఖ అధికారులు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని కోరింది. లబ్దిదారుల దరఖాస్తులను 24 గంటలలోపు పరిశీలించి బ్యాంకులకు అందజేయడం, బ్యాంకులు వాటిని పరిశీలించి అర్హతలను బట్టి రుణం మంజూరుచేయాలన్న జీవో నెంబర్ 101పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సబ్ కమిటీ పేర్కొంది. స్టాండ్ అప్ ఇండియా పథకం కింద అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ల ఎంపికకు సంబంధించిన జాబితాను సత్వర రుణ సహాయం కోసం సంక్షేమశాఖలు బ్యాంకులకు అందజేయాలని సబ్ కమిటీ సూచించింది. సంక్షేమశాఖలు అందజేసే సబ్సిడీలు, ప్రోత్సాహకాలపై విధి విధానాలను తయారుచేయాలని పేర్కొంది. లబ్దిదారులు రుణం పొందే ముందే ఈడీపీ (ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్)లో శిక్షణ కార్యక్రమం కచ్చితంగా పూర్తిచేసుకుని వుండాలని పేర్కొంది.
చేనేత కార్మికులకు 31.3.2014 తేదీ ప్రాతిపదికగా రుణ విముక్తి పథకాన్ని అమలుచేయాలని మరో సబ్ కమిటీ సిఫారసు చేసింది. ఈము పెంపకందారులు నాబార్డు ద్వారా పొందిన రుణ బకాయిల వివరాలు బ్యాంకులకు అందజేస్తే తగిన చర్యలు తీసుకోవడానికి బ్యాంకులు అంగీకరించాయి. సబ్ కమిటీలు చేసిన ఈ సిఫారసులను బ్యాంకర్ల సమితి ముఖ్యమంత్రి ముందుంచింది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *