బదరీ నారాయణ స్వామి సంనిధిలోని భ్రహ్మ కపాలం విశిష్టత

శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు. నాలుగు ముఖాలతో మంత్రోచ్ఛారణ చేస్తున్నాడు. కానీ, ఆయన ఊర్ధ్యముఖం పార్వతీదేవి సౌందర్యానికి మోహనపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఇది గమనించిన పరమ శివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుద్థి చెప్పాలని చేయిచాచి ఒక దెబ్బవేశాడు.
మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా! దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ద్యముఖం తెగిపోయింది. కానీ, అది కిందపడలేదు. శివుడి అరచేతికి అతుక్కుపోయింది. ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు. క్రమక్రమంగా ఎండి, చివరికది కపాలంగా మారిపోయింది.
బ్రహ్మా అపరాధం చేశాడు. దానికి ఆదిదేవుడు శిక్షవేయాల్సి వచ్చింది. అయితే అది సరాసరి బ్రహ్మహత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడికీ అంటింది. జగద్గురువు, ‘మహాతపస్వి ఆయనకూ ఆ పాప ఫలం తప్పలేదు. దేవతలనందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు.
“దేవాదిదేవా! పరమజ్ఞానివి నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి. శాసించగలవాడివి అయినా, మాపై కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు కనుక, మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము… ఆ కపాలాన్నే భిక్షాపాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ ప్రతిచోటా నీ పాపమేమిటో చెప్పుకొని భిక్షమడుగుతూ వెళ్ళు. కొంత కాలానికి ఆ పాపం తరిగిపోయి ఈ కపాలం రాలిపోవచ్చు” అన్నారు దేవతలు.
పరమశివుడికి అది ఉచితమనిపించింది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరిగాడు. ఆ క్రమంలో మామ హిమవంతుడు ఆ ప్రాంతంలో శిఖరాలను, నదులను కానుకగా ఇవ్వగా, శ్రీహరి అడిగితే బదరీవనం వున్న శిఖరాన్ని శివుడు కానుకగా ఇచ్చేశాడు. శ్రీహరి అక్కడ బదరీ నారాయుణుడిగా వెలిశాడు.
ఆ తరువాత శివుడు విష్ణువునే భిక్ష అడిగాడు. సాక్షాత్తూ శివుడే అడగడాన్ని, ఒక అద్భుత సన్నివేశంగా మార్చాలని శ్రీహరి భావించాడు.
శివుడి కపాలంలో భిక్ష వేయబోయాడు అంతే! ఆ కపాలం కాస్తా ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది. అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారియైన బ్రహ్మ కపాలం మహాక్షేత్రమైంది. తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గమై నిలిచింది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *