Freedom 251 Smart Phone Delivery From Today

ఫ్రీడమ్‌ 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీని శుక్రవారం నుంచి ప్రారంభించనున్నట్టు ఈ ఫోన్‌ తయారీ సంస్థ రింగింగ్‌ బెల్స్‌ ప్రకటించింది. తొలి విడతలో 5,000 ఫోన్లను డెలివరీ చేయనున్నట్టు వెల్లడించింది. గురువారంనాడిక్కడ కంపెనీ కొత్త ఫోన్లు, ఎల్‌ఇడి టీవీని ఆవిష్కరించిన సందర్భంగా రింగింగ్‌ బెల్స్‌ డైరెక్టర్‌ మోహిత గోయెల్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ ఫోన్‌ డెలివరీ తీసుకునే వారు ఫోన్‌ ధర 251 రూపాయలతోపాటు 40 రూపాయల డెలవరీ చార్జీని చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రెండు లక్షల ఫ్రీడమ్‌ ఫోన్లను 251 రూపాయల ధరకే అందించడానికి సిద్ధంగా ఉందని, అయితే తమకు ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తేనే ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి సహకారం లభించకపోయినా తాము మాట ఇచ్చినట్టుగా రెండు లక్షల ఫోన్లను డెలివరీ చేస్తామని, అయితే దీనికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.
ఈ ఫోన్‌ కోసం 7 కోట్ల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరిలో రెండు లక్షల మందికి మాత్రమే ఫోన్లను డెలివరీ చేయనున్నారు. లాటరీ ద్వారా కస్టమర్లను ఎంపిక చేయనున్నట్టు గోయెల్‌ తెలిపారు. ఒక్కో ఫ్రీడమ్‌ ఫోన్‌పై తమకు 930 రూపాయల నష్టం వస్తుందని, అసలు ఈ ఫోన్‌ వ్యయం 1,180 రూపాయల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. యాప్స్‌ ద్వారా 300 రూపాయలు పొందినా ఇంకా 630 రూపాయల నష్టం వస్తుందని తెలిపారు. కంపెనీ లాభాల్లో 95 శాతం దాతృత్వం కోసం వినియోగిస్తామని చెప్పారు. ఫ్రీడమ్‌ ఫోన్‌ తప్ప మిగతా కంపెనీ ఉత్పత్తులను తాము లాభాలకే విక్రయిస్తున్నామన్నారు. ఎల్‌ఇడి టీవీలో 10-15 శాతం మార్జిన్‌ ఉందని తెలిపారు. కాగా కంపెనీ ప్రదర్శించిన ఫ్రీడమ్‌ 251 మొబైల్‌లో 1 జిబి రామ్‌, 8 జిబి ఇంటర్నల్‌ మెమరీ, 3.2 మెగాపిక్సెల్‌ కెమెరా, 0.3 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, 1.3 గిగాహెట్జ్‌ ప్రాసెసర్‌, 1,450 ఎంఎహెచ్‌ బ్యాటరీ, డ్యూయల్‌ సిమ్‌ స్లాట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Freedom-251-2

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *