కర్పూరం ఎం చెప్పింది?

శివుడిని అర్చించడానికి ఒక భక్తుడు శివాలయానికి వెళ్లాడు. ఆలయం వెలుపల ఉన్న ఒక దుకాణంలో అర్చన నిమిత్తం కొబ్బరికాయ, కర్పూరం, పువ్వులు, అగరువత్తులు, విభూతి మొదలైనవి కొన్నాడు.
ఈ పూజా సామాగ్రిని ఆ భక్తుడు ఆలయంలో గర్భగుడిలో ఉన్న అర్చకునికి ఇచ్చి అర్చన చెయ్యమని చెప్పాడు.
అర్చకుడు అర్చన పూర్తిచేసి, కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు ఉంచాడు. ఒక అరటిపండును కాస్త గిల్లి దానిని విగ్రహం ముందు ఉంచాడు. ఆ తరువాత అర్చకుడు దైవానికి కర్పూరహారతి ఇచ్చాడు. అప్పుడు భక్తుల ‘శంభోశంకర’ అంటూ చేతులు జోడించి ప్రణామాలు అర్పించారు.
తమ ముందుకు కర్పూర హారతి ఇచ్చిన పళ్లెరాన్ని తెచ్చినప్పుడు భక్తులు హారతిని కళ్లకు అద్దుకున్నారు. తరువాత పళ్లెరాన్ని అర్చకుడు కొబ్బరికాయ, అరటిపళ్లు ఉంచిన చోట పెట్టాడు.
అప్పుడు కొబ్బరికాయ, అరటిపండు పరస్పరం దిగులుపడుతూ ఇలా మాట్లాడుకున్నాయి:
నన్ను రెండుగా పగులగొట్టి దైవ విగ్రహం ముందు ఉంచారు. నిన్ను గిల్లి విగ్రహం ముందు ఉంచారు. అప్పుడు ఈ భక్తులు మౌనంగా ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారే తప్ప, చేతులు జోడించి నమస్కరించలేదు. దీన్ని నువ్వు గమనించావా? అని కొబ్బరికాయ అరటిపండుతో అంది.
బాగానే గమనించాను. అదే భక్తులు కర్పూరహారతి ఇస్తున్నప్పుడు మాత్రం దైవనామాన్ని ఉచ్చరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు ఎందుకని? మనకు లభించని ఈ గౌరవమూ, ప్రాధాన్యమూ ఈ కర్పూరానికి మాత్రం ఎలా దక్కింది? అంది అరటిపండు.
ఈ విధంగా అవి పరస్పరం మాట్లాడుకోసాగాయి. విశ్లేషణాత్మకమైన ఈ సంభాషణాంతంలో అవి, “కర్పూరం తనను దగ్ధం చేసుకొని భక్తులు దైవ విగ్రమాన్ని బాగా దర్శించుకోవడానికి దోహదపడింది. ఆ విధంగా తనను కర్పూరం ఆత్మత్యాగం చేసుకొనడం వలననే, దానికి అంతటి గౌరవ మర్యాదలు లభించాయి” అని తేల్చుకున్నాయి.
తన కోసం మాత్రమే జీవించే వ్యక్తిని లోకం స్మరించి, కీర్తించదు. జనుల హితం కోసం ఎవరు తమను త్యాగం చేసుకొంటారో, వారినే స్మరిస్తూ శ్లాఘిస్తారు.
“యోగం అంటే ఏమిటి?” అన్న దానికి ఒక మహాత్ముడు ఇలా వివరణ ఇచ్చాడు. “ఊరుకై పాటుపడడమే యోగం”.
శ్రేష్ఠత్వానికి గీటురాయి త్యాగమే. అది వ్యక్తిమాత్రుని ఉన్నతుని గావిస్తుంది, సమాజాన్ని ఉద్ధరిస్తుంది.
తక్కిన సాధనలకన్నా త్యాగం మనిషిని భగవంతుని వద్దకు సత్వరమే తీసుకుపోతుంది.
“నిష్కామబుద్ధి ఒకనిలో ఎంత ఎక్కువగా ఉంటుందో, అతడు అంత ఆధ్మాత్మికపరుడు, శివసాన్నిధ్యం పొందినవాడూ అవుతాడు. అతడు విద్యావంతుడైనా లేక నిరక్షరకుక్షి అయినా, శివునికి ఇతరులకన్నా దగ్గరైన వాడే! అతడికి ఈ సంగతి తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చుష అని స్వామి వివేకానంద రామేశ్వర ఆలయ సందర్శన సమయంలో చేసిన ప్రసంగంలో చెప్పారు.
మనుషులను మూడు కోవలుగా వర్గీకరించవచ్చు. ఒక కోవకు చెందిన వ్యక్తులు కేవలం తమకోసం మాత్రమే జీవిస్తారు. తమ భార్యాపిల్లల నిమిత్తమే బతుకుతారు, కరడుగట్టిన స్వార్ధంతో జీవిస్తారు-వీరు మృగాలు.
రెండవకోవకు చెందినవారు తాము జీవిస్తూ,తక్కినవారిని కూడా జీవింపజేస్తారు. వీరు మనుష్యులు.
మూడవకోవకు చెందిన వ్యక్తులు కొందరు ఉంటారు. వీరు ఇతరుల కోసమే జీవిస్తారు. వీరిలో మచ్చుకి రవ్వంత స్వార్ధం కూడా ఉండదు, తమకోసం వీరు ససేమిరా జీవించరు. ఇతరుల నిమిత్తం మాత్రమే జీవించే వీరు ‘మహామనీషి’ గా పేర్కొనబడుతున్నారు

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *