• Uncategorized
  • 0

AP Government Gives Title Swarakala Samrat to S.P.B

‘ఓ పక్క సాగరతీర అందాలు… మరోపక్క అందమైన కొండలు… పరిశుభ్రమైన, సుందర నగరం… అన్నిటికీ మించి మృదుస్వభావం కలిగిన విశాఖవాసులు…. ఒక ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక నగరంగా తీర్చిదిద్దాలంటే ఇంతకంటే ఏం కావాలి?’

‘నగరంలో పర్యాటక రంగం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది… అంతర్జాతీయ పర్యాటకులు విశాఖకు వస్తారు… విశాఖను ఒక సాగరతీర నగరంగా (బీచ్‌ సిటీ), ఒక కొండప్రాంత నగరంగా (హిల్‌ సిటీ) మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం…’

– ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

విశాఖ నగర పర్యాటక శోభను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రెండో రోజు విశాఖ ఉత్సవ్‌ కార్యక్రమాల్లో శనివారం సాయంత్రం ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫల, పుష్ప ప్రదర్శనను తిలకించారు. కార్నివాల్‌లో పాల్గొని నగరవాసులను ఉత్సాహ పరిచారు. అనంతరం బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన వేదిక నుంచి వేలాదిమంది జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పర్యాటక స్వర్గంగా విశాఖను తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలను, తన ఆలోచనలను వివరించారు. పర్యాటక నగరంగా తీర్చిదిద్దడానికి విశాఖను మించిన నగరం దేశంలో మరేదీ లేదని తేల్చి చెప్పారు.

‘భోగాపురంలో అత్యంత సుందరమైన అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతోంది. దీనివల్ల విశాఖ నగరం మరింతగా అభివృద్ధి చెందుతుంది. వారంలో ఐదు రోజులూ కష్టపడేవారు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటారు. అలాంటి వారికి అవసరమైన ఆహ్లాదకర వాతావరణం తీర్చిదిద్దితే పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుంద’ని సీఎం వివరించారు. ఎప్పుడూ ఏవో కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని… అలా జరుగుతుంటే ప్రజలు కూడా వాటిని చూడడానికి ఆసక్తి చూపుతారన్నారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో హైదరాబాద్‌లోని లలితకళాతోరణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని, దీనివల్ల ఆ ప్రాంగణానికి పేరు ప్రఖ్యాతులొచ్చాయని గుర్తు చేశారు. విశాఖలోని సాగరతీరంలో శని, ఆదివారాలు సేదతీరానికి వచ్చే వారి కోసం పలు వినోద కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్య సదస్సు, ఫిబ్రవరి నెలలో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష తదితర కార్యక్రమాలు కూడా విశాఖకు పేరు తెస్తాయని ముఖ్యమంత్రి ప్రస్తావించడం గమనార్హం.

అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రశంసల జల్లు…
2014 అక్టోబరులో హుద్‌హుద్‌ తీవ్ర పెను తుపాను దెబ్బకు అతలాకుతలమైన విశాఖ నగరం నేడు సర్వాంగ సుందరంగా మారడానికి కృషి చేసిన కలెక్టరు యువరాజ్‌, జీవీఎంసీ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు.

ఎస్పీ బాలు ‘స్వర కళా సామ్రాట్‌’ బిరుదు
విశాఖ ఉత్సవ్‌ వేదికపై ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణాన్ని ‘స్వరకళా సామ్రాట్‌’ బిరుదుతో ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని కూడా సన్మానించారు. కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాధరెడ్డి, ఎమ్మెల్సీ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి, ఎంపీలు ఎం.శ్రీనివాసరావు, కె.హరిబాబు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ లాలంభవానీ, భాజపా శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీలు డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తి, చలపతిరావు, కలెక్టరు యువరాజ్‌, జీవీఎంసీ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, వుడా వీసీ బాబూరావునాయుడు తదితరులు పాల్గొన్నారు.

swarakala

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *