• Uncategorized
  • 0

రీ ఎంట్రీ కోసం కష్టపడుతున్న”యువరాజ్ “

  • దేశవాళీలో యువరాజ్‌ మెరుపులు
  • పునరాగమనం దిశగా అడుగులు

యువరాజ్‌ సింగ్‌.. భారత క్రికెట్‌కు దొరికిన సిసలైన ఆల్‌రౌండర్‌. విధ్వంసకర బ్యాటింగ్‌… మెరుపు ఫీల్డింగ్‌.. నాణ్యమైన స్పిన్‌ బౌలింగ్‌తో టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. భారత టీ-20, వన్డే ప్రపంచకప్‌లు నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. కేన్సర్‌నే జయించి.. మళ్లీ క్రీజుకొచ్చి అందరి మనసులనూ గెలిచాడు. కానీ, అందంతా గతం. అతను చివరి టెస్టు ఆడి మూడేళ్లయింది. వన్డేల్లో బరిలోకి రెండేళ్లు గడించింది. టీ-20 ఆడి ఏడాదిన్నర పూర్తయింది. కానీ, అతను పోరాటం మాత్రం ఆపడం లేదు. దేశవాళీల్లో సత్తా చాటుతూ.. తానున్నాననే విషయాన్ని సెలక్టర్లకు గుర్తు చేస్తున్నాడు. మార్చిలో టీ-20 వరల్డ్‌కప్‌ ఉన్న నేపథ్యంలో రీ ఎంట్రీకి యువీకి ఇదే సరైన సమయం. కమాన్‌ యువీ..!

టీమిండియాలోకి పునరాగమనం కోసం దేశవాళీ క్రికెట్‌ను నమ్ముకున్న యువరాజ్‌ ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఫర్వాలేదనిపించిన యువీ.. తాజాగా విజయ్‌ హజారే వన్డే టోర్నీలో బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో రెండు అర్ధశతకాలతో అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాడు. దీంతో స్వదేశంలో టీ-20 ప్రపంచకప్‌నకు ఇంకా మూడు నెలలే ఉన్న నేపథ్యంలో యువీ పునరాగమనం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. మొన్నటి వన్డే ప్రపంచకప్‌ ఎంపిక సమయంలోనూ యువీనే హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గత దేశవాళీ సీజన్‌లో యువీ రాణించినా జట్టులోకి తీసుకోకపోవడంతో అతని మద్దతు దారులు మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోశారు. స్వదేశంలో పొట్టి ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో యువీ ఫ్యాక్టర్‌ ఇప్పుడు ఉత్కంఠ రేకిత్తిస్తోంది.

మళ్లీ ఫామ్‌లోకి..:

యువీ గత వారంలోనే 34వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. యువీ వయసు దృష్ట్యా అతనికిదే చివరి ప్రపంచకప్‌ అని చెప్పొచ్చు. అందుకే జట్టులోకి వచ్చేందుకు ఈ స్టార్‌ లెఫ్టాండర్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 36.18 సగటుతో 398 పరుగులు చేశాడు. గుజరాత (187)పై భారీ శతకం నమోదు చేశాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న విజయ్‌ హజారే వన్డే గ్రూప్‌-ఎలోనూ పంజాబ్‌ తరపున ఆడిన నాలుగు వన్డేల్లో 81.1 సగటుతో 243 రన్స్‌ చేశాడు. వాటిలో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లోనే ముంబైపై 93 బంతుల్లో 93 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆపై హైదరాబాద్‌ (39), అసోం (36)పై ఫర్వాలేదనిపించాడు. చివరగా.. రాజస్థాన్‌పై ఛేదనలో (78 నాటౌట్‌) మెరుపు హాఫ్‌ సెంచరీతో జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో తన మునుపటి ఆటను గుర్తుకు తెచ్చాడు. 18న జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో సర్వీసెస్‌తో పంజాబ్‌ ఆడనుంది. ఆ తర్వాతి రోజే ఆసే్ట్రలియా పర్యటన కోసం టీమిండియా ఎంపిక ఉండడం విశేషం. చాలామంది స్టార్‌ ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ టోర్నీపై సెలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో జరుగుతున్న గ్రూప్‌-ఎ మ్యాచ్‌లకు చీఫ్‌ సెలెక్టర్‌ సందీప్‌ పాటిల్‌ హాజరవుతున్నాడు. దీంతో యువీ ప్రదర్శనను సెలెక్టర్లు గమనిస్తున్నారని స్పష్టమవుతోంది.

yv

Comments

comments

You may also like...