• Uncategorized
  • 0

డాక్టర్లకు ధన దాహం – రోగులకి ప్రాణ సంకటం

  • ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులను క్లినిక్‌లకు మళ్లిస్తున్న వైద్యులు
  • అక్కడి నుంచి రిఫరల్‌ ఆస్పత్రులకు తరలింపు
  • ఎన్‌టిఆర్‌ వైద్యసేవ కింద ఆపరేషన్లు
  • పర్సంటేజీల కోసం విచ్చలవిడిగా స్కానింగ్‌లు
  • తమకేమీరాదంటూ రోగుల నుంచి కూడా కొంత వసూలు
విజయనగరం జిల్లాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి యూరినరీ సమస్యతో గత నెల 28న కేజీహెచ్‌కు వచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యుడు ఇక్కడ సరైన వైద్యం అందదని, తన క్లినిక్‌కు వస్తే సత్వరం మెరుగైన వైద్యం అందిస్తానని చెప్పాడు. దీంతో అతను కేజీహెచ్‌ నుంచి డిశ్చార్జి తీసుకుని, సదరు వైద్యుడి క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడ రక్తపరీక్షలు, స్కానింగ్‌లు చేసిన తర్వాత ఎన్‌టీఆర్‌ వైద్యసేవలో ఆపరేషన్‌ చేస్తానని, రామ్‌నగర్‌లోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాలని వైద్యుడు సూచించాడు. దీంతో ఈ నెల రెండున అతను ఆస్పత్రిలో చేరగా, మూడున శస్త్రచికిత్స చేశారు. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేసినందున తనకేమీ రాదని, ఎంతో కొంత ఇవ్వాలని వైద్యుడు కోరడంతో రోగి బంధువులు ఐదు వేల రూపాయలు ఇచ్చారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తికి కిడ్నీలో రాళ్లు వుండడంతో చికిత్స కోసం పది రోజుల కిందట కేజీహెచ్‌కు వచ్చారు. ఓపీ చూసిన వైద్యుడి సూచన మేరకు రామ్‌నగర్‌లోని ఒక ఆస్పత్రిలో చేరగా గత నెల 30న శస్త్రచికిత్స నిర్వహించారు. వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తారు. సమాజంలో వైద్యుడికి అత్యున్నతమైన గౌరవం వుంది. అయితే కొంతమంది వైద్యులు ధనదాహంతో వైద్యవృత్తికి తలవంపులు తెచ్చిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అనారోగ్యంతో ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజల పట్ల మానవతా దృక్పథంతో వ్యహరించాల్సింది పోయి నిలువుదోపిడీ చేస్తున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేక ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద, మధ్య తరగతి వారిని లక్ష్యంగా చేసుకుని తమ ధనదాహాన్ని తీర్చుకుంటున్నారు. ఎన్‌టిఆర్‌ వైద్య సేవలో వైద్య పరీక్షలు, స్కానింగ్‌లతోపాటు శస్త్రచికిత్స వంటి సేవలు ఉచితంగానే అందుతాయి. అయితే కొంతమంది వైద్యులు మాత్రం రోగుల నిరక్షరాస్యతను సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్‌టిఆర్‌ వైద్య సేవలో రోగి నమైదన తర్వాత స్కానింగ్‌లు చేయించినా తమకు కమీషన్లు రావనే భావనతో ముందే రోగుల సొంత ఖర్చుతో అన్ని రకాల పరీక్షలు చేయించేస్తున్నారు. జిల్లాలో 35 నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో నెలకు సగటున రెండు వేల వరకూ శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. వీటిలో సింహభాగం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులే చేస్తున్నప్పటికీ అవన్నీ ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతుండడం గమనార్హం.

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు క్లినిక్‌లకు తరలింపు

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో ఎన్‌టిఆర్‌ వైద్య సేవ వర్తించే రోగులను గుర్తించి వారిని వైద్యులు తమ క్లినిక్‌లకు తరలించుకుపోతున్నారు. ప్రధానంగా కేజీహెచ్‌ నుంచి ఈ తరహా తరలింపు ఎక్కువగా వున్నదనే ఆరోపణలు కొన్నాళ్లుగా వున్నాయి. కేజీహెచ్‌లో పనిచేస్తున్న కొంతమంది వైద్యులు రోగులను మానవతా దృక్పథంతో కాకుండా ఆదాయ వనరుగా చూస్తున్నారనే విమర్శలు వున్నాయి. కేజీహెచ్‌కు వచ్చే వారిలో అత్యధికులు నిరుపేద, మధ్యతరగతికి చెందినవారే. కేజీహెచ్‌లో చేరిన రోగులను పరీక్షించే సమయంలోనే వారికి ఎలాంటి వైద్యం అవసరం, శస్త్రచికిత్స అవసరం అవుతుందా? లేదా అనేది వైద్యులకు అర్థమైపోతుంది. ఓపీ చూస్తుండగానే ఇక్కడ వైద్యం ఆలస్యం అవుతుందంటూ పరోక్షంగా తమ క్లినిక్‌లకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది అయితే ఓపీలో పనిచేస్తున్న వార్డు బాయ్‌లద్వారా తతంగం నడిపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రైవేటు ఆస్పత్రి అనగానే భయపడి కేజీహెచ్‌లోనే వుంటామని చెప్పి ఇన్‌పేషెంటుగా చేరితే రెండు, మూడు రోజులు వారికి ఎలాంటి వైద్యం అందకుండా చేసి తమదారికి వచ్చేలా చేస్తున్నారు.
#KGHscam
#KGHDoctors
#KGHDoctorsPlaysWithPatientsLives

Comments

comments

You may also like...