• Uncategorized
  • 0

“అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఇర్ఫాన్”

ముంబై: ఇర్ఫాన్‌ పఠాన్‌.. ఒకప్పుడు జాతీయ జట్టులో కీలక పేసర్‌. కెరీర్‌ ఆరంభంలో ఆస్ర్టేలియా, పాకిస్థాన్‌ పర్యటనల్లో అదరగొట్టాడు. సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలో అతను ప్రధాన పేసర్‌ సేవలందించాడు. ఈ లెఫ్టార్మ్‌ మీడియం పేసర్‌ తన అత్యుత్తమ ప్రదర్శనతో ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. అయితే ఆస్ర్టేలియా కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ అతణ్ణి ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలనే ప్రయోగం వికటించింది. ఇర్ఫాన్‌ బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టిసారించడంతో బౌలింగ్‌లో రిథమ్‌ కోల్పోయాడు. దీంతో ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌కు న్యాయం చేయలేక జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇర్ఫాన్‌ 29 టెస్ట్‌ల్లో 100 వికెట్లు.. 1,105 పరుగులు చేశాడు. అలాగే 120 వన్డేల్లో 173 వికెట్లు పడగొట్టి.. 1,544 రన్స్‌ సాధించాడు. పఠాన్‌ చివరిసారి 2012లో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌ ఆడాడు. మూడేళ్ల విరామం తర్వాత పునరాగమనం చేయాలని అతను గట్టిపట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో రాణిస్తుండడంతో ఇర్ఫాన్‌కు మళ్లీ రీఎంట్రీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల గుజరాతతో మ్యాచ్‌లో అతను 6 వికెట్లు తీయడంతో పాటు అర్ధ సెంచరీతో రాణించాడు. అలాగే పంజాబ్‌పై కూడా ఆరు వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికీ టీమిండియా నుంచి మళ్లీ పిలుపు వస్తుందనే ఆశతో ఉన్నానని బరోడా పేస్‌ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. మిగతా వివరాలు అతని మాటల్లోనే..

మళ్లీ జట్టులోకి వస్తా: ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడే ప్రతి ఒక్కరికీ భారతకు ఆడాలనే కల ఉంటుంది. అందుకే నేను రంజీ ట్రోఫీలో పాల్గొంటూ.. మళ్లీ జాతీయ జట్టుకు ఆడాలనే కలను సజీవంగా ఉంచుకుంటున్నాను. ఇందుకోసం నిరంతరం ఆటను మెరుగుపర్చుకుంటూ.. ముందుకు సాగుతున్నాను. మెరుగైన ప్రదర్శన చేస్తే తప్పకుండా సెలెక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉంది.
పూర్తి ఫిట్‌నె్‌సతో ఉన్నా: నేను మళ్లీ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించా. మిగతా రంజీ సీజన్‌లో నూ అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తా. గుజరాతతో మ్యాచ్‌లో స్లో ట్రాక్‌పై కూడా ఆరు వికెట్లు తీయగలిగాను. దీంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇక పంజాబ్‌పై కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచా.
అనుభవం అక్కరకొస్తుంది: జాతీయ జట్టులోకి పునరాగమనం చేయడం అంత సులువు కాదని తెలుసు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన అనుభవం ఇందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. యువ క్రికెటర్లతోనూ నా అనుభవాలను పంచుకుంటున్నా.
సీమ్‌ ఆల్‌రౌండర్‌ అవసరం: ప్రస్తుతం టీమిండియాకు సీనియర్‌ సీమ్‌ ఆల్‌రౌండర్‌ అవసరం ఉంది. నాకున్న అనుభవంతో యువ సీమర్లకు మార్గదర్శనం చేయగలనని భావిస్తున్నా. సౌరవ్‌ గంగూలీ, ద్రావిడ్‌, ధోనీ కెప్టెన్సీలలో మెరుగ్గా రాణించా. ఈ ముగ్గురు కెప్టెన్లది భిన్నమైన శైలి. యువ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా సారథిగా మెప్పిస్తున్నాడు. శ్రీలంక టూర్‌లో అతని కెప్టెన్సీని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం దక్కింది.
ప్రదర్శనే మాట్లాడుతుంది: నేను మాటలతోనే సరిపెట్టాలను కోవడం లేదు. నా ప్రదర్శనే నేనేంటో చెబుతుంది. బరోడా తరఫున అత్యుత్తమ ప్రదర్శన కృషి చేస్తా. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో ఏ స్థానంలోనైనా ఆడడానికి సిద్ధంగా ఉన్నా.

గాయాలు కావడం నేరం కాదు: ఆటగాళ్లకు పదే పదే గాయాలైతే చాలా మంది తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఇదేం నేరం కాదు. క్రీడాకారులకు గాయాలు కావడం కెరీర్‌లో ఒక భాగమే. ఎవరూ గాయాలు కావాలని కోరుకోరు.pathan

Comments

comments

You may also like...