• Uncategorized
  • 0

కార్తీక మాసం… ప్రతీరోజు పండుగే…

katheekamasam karthikadeepam

“న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్”

నిర్మలమైన నీలాకాశం… ఆహ్లాదకరమైన ప్రకృతి… అణువణువు చైతన్య పూరితమైన వాతావరణం… శోభాయమానమైన పూలసోయగాలు… … శివకేశనామస్మరణతో ప్రతిధ్వనించే ఆలయాలు.. , శివపంచాక్షరీ స్తుతులు… మంత్రోచ్చరణతో పూజకార్యాక్రమాలు, కనువిందు చేసే దీపాలు… ..సుగంధపరిమళాలు… గుండెలలో నిండిన ఆధ్యాత్మికతతో, చేతులు జోడించి దైవాన్ని ఆరాధించే భక్తులు… గోదావరి లో పుణ్యస్నానాలు… దీపారాధనతో గోదారి గంగమ్మతల్లికి తెల్లవారుజామునే దీపనమస్కారాలు చేసే మాతృమూర్తులు… దక్షిణ కాశీగా పిలిచే రాజమండ్రి గోదావరి తీరంలో కార్తీకమాసం వైభవం వర్ణించనలవికాదు.. గోదావరి తీరంలో రేవులన్నీ దీపకాంతుల శోభతో మెరిసి పోతు ఉంటాయి..
ఉపవాసం,స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి.విష్ణువును తులసి దళాలు, మల్లె ,కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి. శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు.నారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు.
శుభదాయకమైన కార్తీక మాసంలో తప్పని సరిగా భక్తులు ఆచరించే ఓమంచి సంప్రదాయం…ఈ మాసంలో చేసే ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలా ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ,సోమవారాలలో లేదా ఒక్క ప పూర్ణిమ, సోమవారంరోజైనా నియమనిష్టల తో ఉపవాసం ఉండి,గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభిం చే పుణ్యఫలాన్ని వర్ణిం చడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పారని భక్తుల ఉవాచ….కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహారణలను ఉన్నాయి…
కార్తీక మాసంలో ఆహరపద్దతులు కూడా మారిపోతాయి.. సాత్వికమైన ఆహారం భుజింజాలి.. అంతేకాదు వ్యక్తి గతమైన లక్షణాలు కూడా మార్పు చేసుకుని జీవనం సాగించాల్సి ఉంది.. అన్ని అంశాలపైనా నియంత్రణ సాధించడమే కార్తీక మాసం విశిష్టత….కార్తీకమాసంలో విధులను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక పరమైన ఫలాలను పొందడమే కాకుండా మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల కొత్తగా తలెత్తుతూ ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చు.తామనం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం జోలికి పోరాదు.ఎవ్వరికీ ద్రోహం చేయరాదు.పాపపు ఆలోచనలు చేయకూడదు.దైవ దూషణ తగదు.దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు.కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.
స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం “కార్తీకమాసం’. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది. స్కంద పురాణంలో కార్తిక మాసం గురించి పూర్తిగా వివరించడం జరిగింది… అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం. కార్తీకమాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో ప్రతీరోజూ తెల్లవారుఝూముననే స్నానమాచరించవలెను.అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం , ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలేను. కార్తీకమాసమంతా ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించవలెను. అట్లే సాయంత్ర సమయంలో శివాలయాల్లో గానీ వైష్ణవాలయాల్లోగానీ గోపురద్వారం వద్దగానీ, దేవుని సన్నిదానంలోగానీ ఆలయప్రాంగణంలోగానీ దీపాలు వెలిగించిన వారికి సర్వపాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడ పుణ్యప్రదమే!
కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను ఉంఛి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతోగానీ,కొబ్బరినూనెతోగానీ, నెయ్యితోగాని, అవిశనూనెతోగానీ, ఇప్పనూనెతోగానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపమును వెలిగించవలెను. అంతే కాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలొ ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం. ఈ విధంగా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం , దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.
కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.
కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించాలి…
నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.
శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.
ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను.
ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.
కార్తీక మాసంలో వచ్చే పండుగలకు ఎంతో ప్రాదాన్యత ఉంది.. శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ
దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం. శుక్లపక్ష చవితి ” నాగుల చవితి…కార్తీక శుక్లపక్ష చవితినాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి పర్వదినం జరుపుకుంటారు. శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి..ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన శ్రీమహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి ‘ఉత్థాన ఏకాదశీ లేదా ‘ప్రబోధన ఏకాదశి ‘ అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు… శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రిమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే . ఈ రోజు ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని పూజించవలెను…శుక్లపక్ష చతుర్దశి : వైకుంఠ చతుర్ధశి వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు ఈ దినం వైకుంఠంను వదిలి వారణాసి వెళ్ళి పరమశివుడిని పూజించినట్లు కథనం. ఈ నాడు శైవాలయాలకు వెళ్ళి దీపం వెలిగించవలెను..
శుక్లపక్ష పూర్ణిమ : ఈ దినం శివాలయాల్లో నిర్వహించే ‘జ్వాలాతోరణం ‘ ను దర్శించడం మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలోగానీ,వైష్ణ్వాలయంలోగానీ దీపాలను వెలిగించవలెను. ఈ దినం శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం, మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. కృష్ణపక్ష చవితి : కరక చతుర్ధి
ఇది వినాయకుడుకి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం మంచిది. వృశ్చిక సంక్రమణం…ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు ఈరోజు తులారాశి నుండి ఎనిమిదవ రాశి అయిన వృశ్చికరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు , దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వవిధాలా శుభఫలితాలను ఇస్తుంది.

#Importance-of-kartheekamasam #karthikamasam #karthikapooja #kartheekapaurnami #karthikamasapoojalu

Comments

comments

You may also like...